రామాయణంతో 'దేవర' కి లింక్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవర' సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే
By: Tupaki Desk | 18 Sep 2024 10:38 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవర' సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పలువురు ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో నటించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవలే ముంబై వెళ్లిన ఎన్టీఆర్ తాజాగా చెన్నై కి వెళ్లాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమా స్థాయి మరింతగా పెరింది.
ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ 'దేవర' ట్రైలర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను రామాయణంలోని కొన్ని సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించినట్లు అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. రాముడు సముద్రాన్ని దాటినట్లు 'దేవర' సినిమాలో ఎన్టీఆర్ సముద్రాన్ని దాటుతున్నట్లుగా అనిపించింది. సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించినట్లు ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. దేవరలో మా చిన్న రామయ్య (జూ. ఎన్టీఆర్) పాత్ర లు రెండు చాలా గమ్మత్తుగా ఉంటాయి అనిపిస్తుంది. ఆయన హీరోయిన్ తో కనిపించే సన్నివేశాలు బాగుంటాయి అనిపిస్తోంది.
దేవర, భైరవ పాత్రల్లో కచ్చితంగా ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనబర్చి ఉంటాడు. కనుక సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అదే విషయాన్ని రచయిత గోపాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ను నెగటివ్ పాత్రలో చూడటం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తో పాటు ఎన్టీఆర్ పోషించిన ఒక పాత్ర నెగటివ్ షేడ్స్ ఉండే పాత్ర అయ్యి ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. గోపాల కృష్ణ తన తాజా వ్యాఖ్యల్లో అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. దేవర హీరో అయితే భైరవ విలన్ అయ్యి ఉంటాడని ఆయన అన్నారు.
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. ఆమె కు ఈ సినిమా కచ్చితంగా గట్టి కమర్షియల్ హిట్ ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అదనంగా రెండు షో లకు అనుమతులు ఇచ్చిన కారణంగా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ గత చిత్రాల కలెక్షన్స్ ను బ్రేక్ చేసే విధంగా ఈ సినిమా వసూళ్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.