ఏపీలో దేవరకు బిగ్ షాక్
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ఇటీవల విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 2 Oct 2024 9:17 AM GMTగ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ఇటీవల విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఫస్ట్ డే నుంచే ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీగా సందడి చేస్తున్నారు. అయితే, వీకెండ్ అనంతరం క్రేజ్ మెల్లగా తగ్గినా, సినిమా వసూళ్లు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దసరా సెలవులు కూడా మొదలవ్వడంతో దేవర థియేటర్లలో మరో వారం రోజులు సందడి చేయనుందని తెలుస్తోంది.
ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిర్ణయం ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగించింది. లేటెస్ట్ కథనాల ప్రకారం, దేవర మూవీ సక్సెస్ మీట్ను నిర్వహించడానికి చేసిన ప్రణాళికలు రద్దయినట్లు సమాచారం. ఈ సక్సెస్ మీట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుండగా, అనూహ్యంగా ఈ ఈవెంట్ రద్దయింది. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉందని టాక్.
మూవీ మేకర్స్ దేవర సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని, ఫ్యాన్స్ సమక్షంలో భారీ సక్సెస్ మీట్‌ను ప్లాన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఈవెంట్ అక్టోబర్ 2 లేదా అక్టోబర్ 3 తేదీలలో నిర్వహించాలని భావించినా, అనుకోని కారణాల వలన ఈ కార్యక్రమం జరిగే అవకాశం లేకపోయింది. ఇప్పటికే ప్రీ రీలీజ్ ఈవెంట్ కూడా రద్దవ్వడం, ఇప్పుడు సక్సెస్ ఈవెంట్ కూడా రద్దు కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
దేవర మూవీ ప్రమోషన్ల విషయంలో మేకర్స్ పలు అంశాలు మిస్సయ్యారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మరింత ప్రమోషన్ అవసరమని అంటున్నారు. కానీ, సినిమా విడుదలైన తరువాత కలెక్షన్ల పరంగా సినిమా మంచి స్థిరత్వం ప్రదర్శించడం ఫ్యాన్స్‌కు కొంత ఊరట కలిగిస్తోంది. మూడు రోజుల్లోనే దేవర చిత్రం రూ.300 కోట్ల వసూళ్లు సాధించిందని సమాచారం.
అయితే, ఈ సక్సెస్ మీట్ రద్దు ఎన్‌టీఆర్ అభిమానులకు ఎంతగానో బాధ కలిగిస్తోంది. ఎన్టీఆర్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న అభిమానుల ఆశలు కలవరం చెందాయి. ఈ విషయంపై దేవర టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సక్సెస్ ఈవెంట్‌ను మరొక తేదీకి ప్లాన్ చేస్తారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక దేవర 2 ఎప్పుడు ఉంటుందనే విషయంలో కూడా ఈవెంట్ ద్వారా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.