దేవర.. తమిళంలో మళ్ళీ అదే తంతు..
తమిళ హీరోలకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Tupaki Desk | 26 Sep 2024 6:20 AM GMTతమిళ హీరోలకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్, విక్రమ్, కమల్ హాసన్, సూర్య, విజయ్, కార్తీ, విశాల్, శివ కార్తికేయన్ లాంటి వారందరికి తెలుగులో మంచి ఆదరణ ఉంది. విజయ్ ఆంటోనీ సినిమాలని కూడా తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. తెలుగులో తమిళ్ సినిమాలకి ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో చిన్న చిత్రాలని కూడా తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు.
ఆ సినిమాలకి మన ఎగ్జిబిటర్లు థియేటర్స్ కూడా ఎక్కువగానే ఇస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకి అయితే తెలుగు స్టార్ హీరోలతో సమానంగా స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది. అయితే మన తెలుగు స్టార్ హీరోలకి తమిళంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ లభించదు. అక్కడ ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే కనీసం ఎగ్జిబిటర్లు కూడా తెలుగు సినిమాలని ఎంకరేజ్ చేయరనే టాక్ ఉంది. ‘దేవర’ మూవీతో ఇది మరోసారి ప్రూవ్ అయ్యింది.
‘దేవర’ పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అన్ని భాషలలో ఈ సినిమాకి హైప్ ఉంది. తమిళంలో రిలీజ్ అయిన ‘దేవర’ సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కోలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ‘దేవర’ సినిమాకి సంగీతం అందించారు. దీంతో అనిరుధ్ ద్వారా కావల్సిన హైప్ వచ్చింది. అయిన కూడా ‘దేవర’ మూవీ తమిళనాట థియేటర్స్ కోసం కష్టాలు పడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలో ‘దేవర’ మూవీకి భారీగా థియేటర్స్ దొరికాయి.
కర్ణాటకలో కూడా అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తమిళనాడులో మాత్రం ‘దేవర’ కి థియేటర్స్ ఇవ్వడానికి ఎగ్జిబిటర్లు ముందుకి రావడం లేదు. అత్యంత తక్కువ బజ్ తో రిలీజ్ అవుతోన్న కార్తీ సినిమా ‘మియజగన్’ పైన ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తున్నారు కానీ ‘దేవర’కి అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ చేయడం లేదంట. సింగిల్ స్క్రీన్స్ లలో కూడా కార్తీ సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే స్క్రీన్స్ పరంగా ‘దేవర’కి తమిళనాడులో తక్కువ స్క్రీన్ స్పేస్ దొరికిందని అంటున్నారు.
ఒకవేళ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి ప్రేక్షకాదరణ పెరిగితే అప్పుడు థియేటర్స్ సంఖ్య పెంచే ఛాన్స్ ఉందంట. తమిళ్ ఆడియన్స్ ఇంటరెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జిబిటర్స్ ‘దేవర’ సినిమాని ఎక్కువ థియేటర్స్ లో ప్రదర్శించడానికి ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం నడుస్తోంది. అయితే దానికి విరుద్ధంగా తెలుగు రాష్ట్రాలలో కార్తీ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘సత్యం సుందరం’కి ఎక్కువ స్క్రీన్స్ దొరికాయి. దీంతో సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఉన్నంత స్వచ్ఛంగా తమిళవాళ్ళు ఉండడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. మరి దేవర సినిమా అక్కడ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.