దేవర మరో లీక్.. సెన్సేషనే..
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కలయికలో రానున్న 'దేవర' సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 20 Aug 2024 8:19 AM GMTజూనియర్ ఎన్టీఆర్ కొరటాల కలయికలో రానున్న 'దేవర' సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు ఈ హైప్‌ను మరింత పెంచాయి. మొదట విడుదలైన ఫియర్ సాంగ్, తరువాత వచ్చిన చుట్టుమల్లే పాటలు ఇప్పటికే భారీ వ్యూస్ సాధించి, మ్యూజికల్ సెన్సేషన్‌గా మారాయి. ఈ క్రమంలో అభిమానులు థర్డ్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, సినిమా విడుదలకు ముందే 'దేవర' చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలు లీక్ అవుతుండటం అభిమానులకు, చిత్ర యూనిట్‌కు చికాకుగా మారింది. తాజాగా, ఈ చిత్రం నుండి "ఆయుధ పూజ" పాట అనే ఒక ఆడియో సోషల్ మీడియాలో లీకై, వైరల్ అవుతోంది. ఈ పాట సినిమాలో ఆయుధ పూజ సన్నివేశంలో వస్తుందనే ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ పాట వాస్తవంగా సినిమా నుండి లీక్ అయ్యిందా, లేక ఫేక్ ఆడియో క్లిప్ అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ, ఈ ఆడియోను విన్న అభిమానులు థియేటర్లలో తమ అభిమాన హీరో కోసం పూనకాలే ఊగిపోతారని కామెంట్స్ చేస్తున్నారు. లీకుల సమస్య మాత్రం దేవర సినిమా నుంచి తప్పడం లేదు. గోవా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ వీడియోలు రెండు సార్లు లీక్ అయ్యాయి. ఇక ఇప్పుడు పాట కూడా ముందే బయటకు రావడం చిత్ర యూనిట్‌కు తలనొప్పిగా మారింది.
లీకుల సమస్యను ఎలా ఎదుర్కోవాలో అని నిర్మాతలు, దర్శకులు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. 'దేవర' సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాలో శ్రీకాంత్ కూడా కీలక పాత్ర పోషించారు. మొదట ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని భావించినా, 'ఓజీ' చిత్రం వాయిదా పడటంతో, దేవర సినిమాను సెప్టెంబర్ 27కి ముందుకు తేవాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో, అదే తేదీలో రజినీకాంత్ వేట్టయాన్, సూర్య కంగువ సినిమాలు కూడా విడుదల అవుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఇక 'దేవర' సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ 'వార్ 2' షూటింగ్ పై దృష్టి పెట్టనున్నారు. ఆయన త్వరగా ఈ సినిమాను ముగించి, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న 'ఎన్టీఆర్ 31' ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.