దేవర.. ఇక బాలీవుడ్ టెన్షన్ తీరినట్లే!
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
By: Tupaki Desk | 10 April 2024 10:12 AM GMTజూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా తెలుగులో ఈ సినిమా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఇది వరకే జూనియర్ ఎన్టీఆర్ మాటలను బట్టి ఫాన్స్ ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. అసలే దర్శకుడు కొరటాల శివ ఈ కథ కోసమే చాలా టైం తీసుకున్నాడు.
ఇక ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చూస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ కు కూడా ఇది చాలా కీలకమైన సినిమా. RRR సినిమా కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు దక్కింది. అయితే అందులో మరో హీరోగా రామ్ చరణ్ నటించగా, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఎన్టీఆర్ ఇప్పుడు సోలోగా సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఒక టీజర్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నప్పటికీ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాను ఎలా ప్రమోట్ చేస్తారు అనే డౌట్స్ మొదటి నుంచి ఉన్నాయి.
సినిమాలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్, జాన్వీ నటిస్తున్నప్పటికి బిజినెస్ పరంగా ఎవరో ఒకరు బలంగా ఒక పుష్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఒక్క అప్డేట్ తో మేకర్స్ హిందీలో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అన్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే ఈ సినిమాను నార్త్ లో ప్రముఖ నిర్మాత ధర్మ మూవీస్ అధినేత కరణ్ జోహార్ విడుదల చేయబోతున్నారు. ఆయనతోపాటు ఏఏ ఫిలిమ్స్ ఇండియా వాళ్ళు కూడా ఈ కాంబినేషన్లో భాగం కాబోతున్నారు.
నార్త్ స్టేట్స్ కు సంబంధించిన రిలీజ్ హక్కులను కరణ్ జోహార్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన చేతిలో సినిమా పడింది అంటే తప్పకుండా ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పవచ్చు. అలాగే థియేటర్స్ కూడా గట్టిగానే లభించే అవకాశం ఉంది. గతంలో కరణ్ జోహార్ బాహుబలి సినిమాకు ఏ విధంగా హెల్ప్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అలాగే పలు సౌత్ సినిమాలను కూడా అప్పుడప్పుడు ఆయన హిందీలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు దేవర సినిమాపై కూడా ఆయన ఆసక్తి చూపించి సొంతంగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. కరణ్ జోహార్ ద్వారా మేకర్స్ మరింత ప్రమోషన్స్ తో సినిమాకు బజ్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఇక కంటెంట్ ఏ మాత్రం బాగున్నా సినిమా మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని దేవర టీమ్ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.