చిరు-పవన్ తర్వాత.. ఆ ఘనత దేవరకొండ సోదరుదలదే..
భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలు
By: Tupaki Desk | 18 July 2023 11:39 AM GMTఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ఎప్పటికీ నిలిచిపోతాయి. మనసును హత్తుకుని ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇప్పుడు 'బేబీ' సినిమా కూడా అదే కోవాకు చెందేలా అనిపిస్తోంది. ఎక్కడ చూసిన అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ నోట విన్నా కూడా ఈ చిత్రం పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ అయితే ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయారు. అలాగే వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ ముందు మంచి కలెక్షన్స్ అందుకుంటోంది చిత్రం. నటుడిగా, హీరోగా నిలుదొక్కుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఆనంద దేవరకొండను.. ఈ ఒక్క చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే భారీ సక్సెస్ ను ఇచ్చింది. పైగా ఇదే అతనికి తొలి విజయం కూడా. భవిష్యత్ లో అతడు మరిన్ని మంచి సినిమాల్లో నటించేందుకు ఓ మంచి ప్లాట్ ఫామ్ దొరికినట్టైంది.
మరోవిషయమేమిటంటే.. ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది బ్రదర్స్ హీరోలుగా రాణిస్తూ కెరీర్ లో ముందుకెళ్తున్నారు. కానీ వారిలో చాలా మంద సక్సెస్ ట్రాక్ మీద నడవట్లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుని కెరీర్ లో దూసుకెళ్తున్నారు. మరొకరు అడపాదడపా చిత్రాలు చేసుకుంటూ చిన్న చిన్న విజయాలను నమోదు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో మెగా ఫ్యామిలీ మాత్రం భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే హీరోలుగా సక్సెస్ అయిన బ్రదర్స్ ఆ కుటుంబం నుంచి మాత్రమే ఉన్నారు. ఒకరు మెగాస్టార్ ఇంకొకరు పవర్ స్టార్. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుని ఏ హీరోకు లేనంత భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు.
చిరు కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ లు, బ్లాక్ బాస్టర్ హిట్లు, కల్ట్ క్లాసిక్ హిట్లు చాలానే ఉన్నాయి. 'రుద్రవీణ', 'ఖైదీ', 'గ్యాంగ్ లీడర్', 'జగదీక వీరుడు అతిలోక సుందరి'.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. వీటిలో 'ఖైది'.. చిరు కెరీర్ కు భారీ టర్నింగ్ పాయింట్. ఆయన్ను ఓ మంచి స్థాయిలో నిలబెట్టింది. దీంతో ఆయన తిరుగులేని హీరోగా ఎదిగారు. అలానే పవన్ కెరీర్ లోనూ 'ఖుషి', 'బద్రి', 'తమ్ముడు' ఇలా ఎన్నో కల్ట్ క్లాసిక్ హిట్స్ ఉన్నాయి.
వీటిలో 'ఖుషి'.. పవన్ కెరీర్ కు పెద్ద ప్లస్. ఇప్పటికీ ఈ చిత్రం గురించి అంతా మట్లాడుకుంటూనే ఉంటారు. పాటలు కూడా సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అలా ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు అన్నదమ్ములు హీరోలుగా భారీ సక్సెస్ ను అందుకున్నది ఇప్పటివరకు వీరిద్దరు మాత్రమే అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వారి తర్వాత ఆ స్థానాన్ని విజయ్ దేవరకొండ - ఆనంద్ దేవరకొండ భర్తీ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు కారణం 'బేబీ'.
ఇప్పటికే కెరీర్ లో విజయ్ దేవపకొండ 'అర్జున్ రెడ్డి'తో ఎంత క్రేజ్ తెచుకున్నాడో తెలిసిన విషయమే. ఈ ఒక్క సినిమా ఆయనకు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది. టాలీవుడ్ ఓ కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఆయన హీరోగా నిలదొక్కుకోవడానికి ఈ సినిమానే పునాది. ఇప్పుడు ఇలాంటి సక్సెస్ నే ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'బేబీ' చిత్రంతో అందుకున్నారు. ఆయనకు ఇప్పుడు ఈ చిత్రం స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టిందనే చెప్పాలి.
భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి ఆయనకో అవకాశం దొరికింది. వాస్తవానికి 'ఆర్జున్ రెడ్డి', 'బేబీ' రెండూ లవ్ స్టోరీ నేపథ్యంలోనే తెరకెక్కాయి. కానీ మూవీలో కాన్సెప్ట్ వేరు. ఇంకో విషయమేమిటంటే.. రియల్ లైఫ్ లో ఈ ఇద్దరు అన్నదమ్ముళ్లు భిన్నంగా ఉంటారు. స్టైల్, యాటిట్యూడ్, టాకింగ్ స్టైల్.. ఇలా ఎందులోనూ సంబంధం ఉండదు. కానీ ఈ ఇద్దరు మాత్రం ఒకే నేపథ్యం ఉన్న కథతో కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే హిట్స్ అందుకున్నారు.
ఇదే విషయాన్ని 'బేబీ' సక్సెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాసు కూడా చెప్పారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు స్టార్ ఉండటం చాలా అరుదు అని చెబుతూ ప్రశంసించారు. ఆనంద్ దేవరకొండకు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి బేబీ చిత్రంతో మంచి ప్లాట్ ఫామ్ దొరికిందని, తర్వాత ఎంచుకోబోయే రెండు చిత్రాలు అతడి కెరీర్ ను డిసైడ్ చేస్తాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటలు విన్న దేవరకొండ ఆనందంతో తెగ సంబరపడిపోతున్నారు. ఇండస్ట్రీలో మెగాస్టార్-పవర్ స్టార్ తర్వాత ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు బ్రదర్స్ హీరోలుగా ఇంతటి గ్రాండ్ సక్సెస్ ను అందుకున్నది దేవరకొండ బ్రదర్సే అని కొనియాడుతున్నారు.