దేవర కొత్త ట్విస్ట్.. ఆ మూవీ యాంగిల్ లోనే..
డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న ప్రభాస్.. రెబల్ తో డిజాస్టర్ ఫేస్ చేసిన రోజులు అవి
By: Tupaki Desk | 11 Feb 2024 10:30 AM GMTడార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న ప్రభాస్.. రెబల్ తో డిజాస్టర్ ఫేస్ చేసిన రోజులు అవి. ఆ టైంలో ఓ కొత్త దర్శకుడితో మిర్చి సినిమా ప్రభాస్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చినా.. ఆ ప్రాజెక్టు పై ఎలాంటి హైప్ క్రియేట్ అవ్వలేదు. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయ్యిందో.. అప్పటి నుంచి ఈ సినిమా పై మూవీ లవర్స్ ఫోకస్ పడింది. థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ప్రభాస్ కు ఎంతో స్పెషల్ మూవీ అయిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించిన విషయం తెలిసిందే.
దర్శకుడిగా కొరటాల శివకు మిర్చి మొదటి సినిమానే అయినా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం కొరటాల శివ.. ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ 80 శాతం కంప్లీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ అనుకోకుండా గాయపడడంతో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లే. త్వరలోనే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఖరారు చేయనున్నారు మేకర్స్. మరో వైపు, దేవర రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత రెండో భాగం షూటింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
ఇక ఈ మూవీ లో మిర్చి సినిమా ఫార్ములా ను కొరటాల శివ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దేవర కూడా తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలోనే చిత్రీకరిస్తున్నారట. ఎన్టీఆర్ ను రెండు పాత్రల్లో చూపించబోతున్నారట. మిర్చి మూవీలో లాగే చాలా పవర్ ఫుల్ గా ఎన్టీఆర్ ను కొరటాల తండ్రీకొడుకుల పాత్రలలో చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట దేవర మేకర్స్. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీ చేశారు. 2016లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దేవర పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.