Begin typing your search above and press return to search.

'పుష్ప 2'.. ఇక్కడ దేవిశ్రీ ఒక్కడినే నిందించడం కరెక్టేనా?

అలాంటి డీఎస్పీ ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' సినిమా మ్యూజిక్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Nov 2024 2:30 AM GMT
పుష్ప 2.. ఇక్కడ దేవిశ్రీ ఒక్కడినే నిందించడం కరెక్టేనా?
X

సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. తన సంగీతంతో గత కొన్నేళ్లుగా సంగీత ప్రియులను అలరిస్తున్నారు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని రకాల పాటలకు ట్యూన్స్ సమకూరుస్తూ, చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందిస్తున్నారు. సాంగ్స్ మాత్రమే కాదు, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇస్తారనే పేరు తెచ్చుకున్నారు. అలాంటి డీఎస్పీ ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' సినిమా మ్యూజిక్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ మేకర్స్ కు నచ్చకపోవడం వల్లనే, అతని స్థానంలో ఈ ప్రాజెక్ట్ లోని మరికొందరు మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చి చేరారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'పుష్ప: ది రైజ్' సినిమా సక్సెస్ లో దేవిశ్రీ ప్రసాద్ కు మేజర్ క్రెడిట్ దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రానికి ఆయన అందించిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అల్లు అర్జున్ తర్వాత ఈ సినిమాని అంతగా పాపులర్ అయ్యేలా చేసింది డీఎస్పీ పాటలే. ముఖ్యంగా 'ఊ అంటావా' పాట నార్త్ ను ఓ ఊపు ఊపేసింది.. పాన్ ఇండియా అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. ఈ సినిమాకి గాను దేవిశ్రీకి నేషనల్ ఫిలిం అవార్డ్ వచ్చిందంటే, ఆయన మ్యూజిక్ గురించి ఇంతకంటే చెప్పాల్సిందేమీ లేదు. అయితే ఇప్పుడు దానికి సీక్వెల్ గా రాబోతున్న 'పుష్ప 2' మ్యూజిక్ విషయంలో మొత్తం క్రెడిట్ దేవిశ్రీకి దక్కడం లేదు.

'పుష్ప 2: ది రూల్' పాటలు, కొంతభాగం బీజీఎమ్ వరకే దేవిశ్రీ ప్రసాద్ పరిమితం అయ్యారు. సినిమాలోని మిగతా పోర్షన్స్ కు ఎస్.థమన్, అజనీష్ లోక్ నాథ్, సామ్ సీఎస్ లాంటి మరో ముగ్గురు సంగీత దర్శకులు బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసారు. దీనిపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే మేకర్స్ నిర్ణయంతో డీఎస్పీ చాలా డిజప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన పుష్ప ఈవెంట్ లో ఆయన వేదిక మీదనే తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. స్క్రీన్ మీద క్రెడిట్ కోసం పబ్లిక్‌గా అడిగే స్థితికి దేవిశ్రీని తీసుకొచ్చారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

'పుష్ప 2' చిత్రాన్ని దేవిశ్రీ ప్రసాద్ నిర్లక్ష్యం చేశాడని అనుకోడానికి.. ఆయన గత రెండేళ్లలో ఎక్కువ సినిమాలేమీ చేయలేదు. లాస్ట్ ఇయర్ 'వాల్తేర్ వీరయ్య' సినిమాకు మాత్రమే సంగీతం సమకూర్చారు. ఈ ఏడాదిలో 'రత్నం' 'కంగువ' చిత్రాలకు మ్యూజిక్ అందించారు. ఆయన చేతిలో ఇప్పుడున్న 'తండేల్', 'కుబేర' సినిమాలు కూడా అప్పుడెప్పుడో కమిటై ఉన్నవి. కొత్తగా మరే ఇతర ప్రాజెక్ట్స్ కు సైన్ చేయలేదు. కాబట్టి 'పుష్ప 2' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పట్ల డీఎస్పీ ఎంతో కమిట్మెంట్ తో ఉన్నారనే విషయం అర్థమవుతుంది.

నిజానికి 'పుష్ప 2' సినిమా కోసం దర్శకుడు సుకుమార్ చాలా ఎక్కువ సమయమే తీసుకున్నారు. పెద్దగా విఎఫ్‌ఎక్స్‌ అవసరం లేని, ఒక మాస్‌ మసాలా ప్రాజెక్ట్‌పై మూడేళ్లుగా వర్క్ చేస్తున్నారు. దగ్గర దగ్గర 1000 రోజులు ఈ సీక్వెల్ మీదనే కూర్చున్నారు. మూవీ ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నారు. రిలీజ్ కు సరిగ్గా 8 రోజుల ముందు కూడా షూటింగు చేశారంటే, సుక్కూ ఎంతగా ఈ సినిమాని చెక్కుతూ వచ్చారో ఒక ఐడియా వస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడినే నిందించడం కరెక్టేనా? అనే ప్రశ్నలు వస్తాయి.

'పుష్ప 2' చిత్రాన్ని ముందుగా ఆగస్టులో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి వర్క్ ఫినిష్ అవ్వలేదు. దీంతో డిసెంబరు 5వ తేదీకి వాయిదా వేశారు. ఒకవేళ అంతా అనుకున్నట్లే జరిగితే ఏ సమస్యా ఉండేది కాదేమో. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ 'పుష్ప' సీక్వెల్ మ్యూజిక్ కంప్లీట్ చేసుకొని, 'కంగువ' సినిమాపై ఫోకస్ చేసేవారు. కానీ అలా జరగలేదు. సుకుమార్ ఈ సినిమాని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో, విడుదలకు ముందు హడావిడిగా పనులు చేయాల్సి వచ్చింది.

సుకుమార్ ముందుగానే 'పుష్ప 2' షూటింగు కంప్లీట్ చేసి దేవిశ్రీ ప్రసాద్ కి ఇచ్చుంటే, బీజీఎం చేసి ఇచ్చేవారు. అది నచ్చకపోతే మళ్ళీ దానిపై పని చేయించుకోడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు టైం లేకపోవడంతో, చివరి నిముషంలో ఇతర సంగీత దర్శకులకు వర్క్ డివైడ్ చేసి బ్యాగ్రౌండ్ స్కోర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితికి దర్శకుడు సుకుమార్ వర్కింగ్ స్టయిల్ కూడా ఒక కారణమని భావించవచ్చని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సుకుమార్ కెరీర్ ప్రారంభం నుంచీ ప్రతీ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం పరంగా తనవంతు మద్దతునిస్తూ వస్తున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మ్యూజిక్ విషయంలో మాత్రం దేవి నిరుత్సాహ పరచలేదు. మరోవైపు అల్లు అర్జున్‌కి కూడా డీఎస్పీ మంచి మ్యూజికల్ హిట్స్ అందించారు. కానీ ఇప్పుడు వీరి ముగ్గురు కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'పుష్ప 2: ది రూల్' విషయానికి వచ్చే సరికి, బ్యాగ్రౌండ్ స్కోర్ దగ్గర తేడా వచ్చినట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో బన్నీ - సుకుమార్ ల సినిమాలకు దేవీశ్రీని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటే వీరి బంధంపై అందరికీ ఓ క్లారిటీ వచ్చేస్తుంది.