'పుష్ప 2' బీజీఎంలో దేవిశ్రీ క్రెడిట్ 10 శాతమేనా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ ను రూల్ చేసింది.
By: Tupaki Desk | 14 Jan 2025 11:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ ను రూల్ చేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇక ఈ మూవీ సక్సెస్ లో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చార్ట్ బస్టర్ సాంగ్స్ పాన్ ఇండియా వైడ్ గా బాగా వైరల్ అయ్యాయి. అలానే సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే 90 శాతం బీజీఎం తనే చేసినట్లుగా మరో సంగీత దర్శకుడు సామ్ సిఎస్ చెబుతున్నారు.
'పుష్ప 2' సినిమాకి తమిళ మ్యూజిక్ కంపోజర్ సామ్ సీఎస్ అడిషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో వర్క్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "బెస్ట్ వర్క్ ఇవ్వడానికి ప్రయత్నించా. సినిమాకు సంబంధించి దాదాపు 90 శాతం బీజీఎం వర్క్ చేశాను. ముఖ్యమైన సన్నివేశాలకు కొంత భాగం డీఎస్పీ స్కోర్ చేశారు. ఈ చిత్రానికి బిజిఎమ్ చేయడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. నేను అతనితో మాట్లాడటానికి ప్రయత్నించాను కానీ, ఆ సమయంలో చాలా బిజీగా ఉన్నట్లు తెలిసింది" అని అన్నారు. దీంతో పుష్ప సీక్వెల్ బిజిఎమ్ లో డీఎస్పీ క్రెడిట్ 10 శాతమేనా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇంకా 'పుష్ప 2'లో భాగం అవ్వడం గురించి సామ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలోకి నన్ను తీసుకోడానికి మెయిన్ రీజన్ వీలయినంత త్వరగా వర్క్ ఫినిష్ చేయడం కోసమే. ఆ సమయంలో దేవిశ్రీ ప్రసాద్ పలు ప్రాజెక్ట్స్‌పై పని చేస్తున్నారు. 'కంగువ' సినిమాతో పాటుగా ఒక షో కూడా ఉంది. నిర్మాత రవి సార్ నా దగ్గరకు వచ్చి ఏం చేయగలిగితే అది చేయమని చెప్పారు కానీ, 13 రోజులు మాత్రమే టైమ్ ఉంది. 3 గంటలకు పైగా నిడివి ఉన్న సినిమా అది. 13 రోజుల్లో ఎలా చేయగలం?"
"ఇప్పుడు నేను పెద్ద హీరోలకు వర్క్ చేస్తున్నాను. నేను ఏదైనా తప్పు చేస్తే, నాకు సంగీతం చేయడం తెలియదని జనాలు అనుకుంటారు. పని వచ్చో రాదో అనేది నాకు, డైరెక్టర్స్ కు తెలుసు.. కానీ ఆడియన్స్ అలా అనుకోరు కదా. నేను దాని గురించి బాగా ఆలోచించి ఒకానొక దశలో సినిమాకి పని చేయాలని నిర్ణయించుకున్నాను. నేను చేసే బీజీఎం ఇండియా లెవల్ లో ఎవరూ ఇప్పటివరకూ చేసి ఉండకూడదని అనుకున్నాను" అని చెప్పారు. అయితే దేవిశ్రీ ప్రసాద్‌తో నిర్మాతలకు ఎలాంటి సమస్య ఉందో తనకు నిజంగా తెలియదనిసామ్ సీఎస్ అన్నారు.
కాగా, 'పుష్ప 2' రిలీజ్ కు ముందు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అనేక చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ.. మరో ముగ్గురు సంగీత దర్శకులను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావడం కొన్నాళ్ళపాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడిచింది. డీఎస్పీ పాటలకే పరిమితం అవుతున్నారని.. థమన్, సామ్ సీఎస్, అజనీష్ లోక్ నాథ్ బీజీఎం కోసం వర్క్ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో క్రెడిట్ అడిగిమరీ తీసుకోవాలంటూ పబ్లిక్ గా కామెంట్ చేయడం పలు పుకార్లకు కారణమైంది.
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఫైనల్ గా 'పుష్ప 2' సినిమాలో థమన్, అజనీష్ ల స్కోర్ ను ఉపయోగించలేదు. సామ్ సీఎస్ కు మాత్రం అదనపు నేపథ్య సంగీతం అంటూ టైటిల్ కార్డ్ లో క్రెడిట్ ఇచ్చారు. అంతకముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లైమాక్స్ కి దేవిశ్రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతం.. నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడు అంటూ సుకుమార్ కొనియాడారు. కానీ ఆ వెంటనే సామ్ ట్వీట్ చేస్తూ.. పుష్ప-2 నాకు అద్భుతమైన ప్రయాణం. పవర్ ప్యాక్డ్ ఫైట్ సీన్స్, క్లైమాక్స్‌లో పని చేయడం ఒక భిన్నమైన అనుభవం అంటూ పేర్కొన్నారు. దీంతో బీజీఎం క్రెడిట్ మీద చర్చలు జరిగాయి. ఇప్పుడు లేటెస్టుగా సినిమాలో ఆల్మోస్ట్ 90% బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తనే చేసినట్లుగా సామ్ చెప్పడం గమనార్హం.