Begin typing your search above and press return to search.

మ్యూజిక్ డైరెక్టర్ గా రాక్ స్టార్ తమ్ముడు?

అయితే పాపులర్ సింగర్ సాగర్ ఇప్పుడు సంగీత దర్శకుడుగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 3:56 AM GMT
మ్యూజిక్ డైరెక్టర్ గా రాక్ స్టార్ తమ్ముడు?
X

సౌత్ లో సంగీత దర్శకులుగా మారిన గాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ వారిలో సక్సెస్ అయి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. ప్లేబ్యాక్ సింగర్స్ గా ఎంతో పేరు తెచ్చుకున్నప్పటికీ, మ్యూజిక్ కంపోజర్స్ గా మాత్రం తమ ముద్ర వేయలేకపోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గర నుంచి కార్తీక్ వరకూ ఎందరినో దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే పాపులర్ సింగర్ సాగర్ ఇప్పుడు సంగీత దర్శకుడుగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.





సింగర్ సాగర్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడనే సంగతి అందరికీ తెలిసిందే. 80కి పైగా పాటలు పాడి మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దేవిశ్రీ సంగీతం అందించిన చిత్రాల్లోనే ఎక్కువ పాటలు పాడాడు. ఓవైపు తన అన్న యూత్ ఫుల్ ట్యూన్స్ కంపోజ్ చేస్తుంటే, మరోవైపు తమ్ముడు తనదైన వాయిస్ తో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. కాకపోతే అన్నదమ్ముల ఇద్ద‌రి గొంతులూ దాదాపుగా ఒకేలా ఉండటంతో, ఎవ‌రు ఏ పాట పాడారో చెప్ప‌డం క‌ష్టం అవుతుంది. ఇదిలా ఉంటే సాగ‌ర్ ఇప్పుడు తన బ్రదర్ బాటలో మ్యూజిక్ డైరెక్టర్ గా మార‌బోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

ప్లేబ్యాక్ సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సాగర్.. ఎప్ప‌టి నుంచో మ్యూజిక్ కంపోజర్ గా మారాలని చూస్తున్నారట. ఇది వరకే ఎన్నో అవకాశాలు వచ్చినా, ఒక భారీ ప్రాజెక్ట్ తోనే సంగీత దర్శకుడిగా పరిచయం అవ్వాలని వేచి చూస్తున్నారట. ఇన్నాళ్లకు సాగర్ కు అలాంటి గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఓ స్టార్ హీరో, మాస్ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాకి సంగీతం సమకూర్చే అవకాశం డీఎస్పీ సోదరుడికి దక్కిందని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన వివ‌రాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని చెబుతున్నారు.

నిజానికి సాగర్ తన అన్నలాగే మల్టీ టాలెంటెడ్ అనిపించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. గాత్రంతో ప్లేబ్యాక్ సింగర్ గా పేరు తెచ్చుకోవడమే కాదు.. 'నేను శైలజ' సినిమా, 'లైగర్' తమిళ వెర్షన్ లో స్వయంగా పాటలు రాసి లిరిసిస్ట్ గా మారారు. కొన్ని మ్యూజిక్ షోలకు యాంకరింగ్ చేసి హోస్ట్ అవతారమెత్తాడు. అలానే తన తండ్రి సత్యానంద్ దారిలో రచయితగానూ మారే ప్రయత్నం చేశాడు. 'రాక్ష‌సుడు', 'ఖిలాడీ' వంటి చిత్రాలకు డైలాగ్ రైటర్ గా ప‌ని చేశాడు. 2017లో 'కచ్చే దిన్' అనే షార్ట్ ఫిల్మ్ కు మ్యూజిక్ కంపోజ్ చేసిన సాగర్.. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో పూర్తి స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీలో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి, అనిరుధ్ రవిచందర్, దేవిశ్రీ ప్ర‌సాద్, ఎస్ఎస్ థమన్, సంతోష్ నారాయణ్ లాంటి ఐదారుగురి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తుంటాయి. వీళ్లంతా బ్యూటిఫుల్ సాంగ్స్ తో పాటు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తారనే పేరు తెచ్చుకున్నారు. అందుకే వీళ్ళకు ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువ. స్టార్ హీరోల సినిమాలకు, భారీ బడ్జెట్ చిత్రాలకు వీళ్ళే ఫస్ట్ ఛాయిస్. ఎందరో న్యూ కంపోజర్స్ వచ్చారు కానీ, వీళ్ళ మాదిరిగా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్లుగా మారలేకపోయారు. మరి ఇప్పుడు అన్న బాటలో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న సాగర్.. దేవిశ్రీ మాదిరిగా సక్సెస్ సాధిస్తారో లేదో వేచి చూడాలి.