యాంటీ ఫ్యాన్స్ వల్లే ‘కంగువ’ ఆడలేదు-నిర్మాత
నిర్మాతల మీద కూడా భారీగానే భారం పడ్డట్లు కనిపిస్తోంది.
By: Tupaki Desk | 26 Nov 2024 9:48 AM GMTకోలీవుడ్‌కు ‘బాహుబలి’ అవుతుందనే అంచనాల మధ్య విడుదలైన భారీ చిత్రం ‘కంగువ’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. వెయ్యి కోట్లు, రెండు వేల కోట్ల అంటూ కలెక్షన్ల గురించి రిలీజ్ ముంగిట పెద్ద పెద్ద అంచనాలు కట్టారు కానీ.. ఈ చిత్రం ఫుల్ రన్లో అటు ఇటుగా రూ.200 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. మొదట్లో వచ్చిన టాక్ చూస్తే ఆ మాత్రం వసూళ్లు రావడం కూడా గొప్పే. ఈ సినిమాకు జరిగిన బిజినెస్‌లో సగం కూడా థియేటర్ల నుంచి వెనక్కి రాలేదు. బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. నిర్మాతల మీద కూడా భారీగానే భారం పడ్డట్లు కనిపిస్తోంది. తొలి రోజు సినిమాకు బ్యాడ్ టాక్ రాగా.. నిర్మాత జ్ఞానవేల్ రాజా మేకపోతు గాంభీర్యం ప్రకటించాడు. సోషల్ మీడియాలో కొంచెం నెగెటివ్ టాక్ వచ్చినా.. జనం బాగానే థియేటర్లకు వస్తున్నారని, సినిమా హిట్ అని, సెకండ్ పార్ట్ కూడా వస్తుందని చెప్పుకున్నాడు. తర్వాత చూస్తే ‘కంగువ’ పెద్దగా పుంజుకోలేదు.
‘కంగువ’ ఆడకపోవడానికి కంటెంట్ కారణం కాదంటూ ఈ చిత్ర సహ నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాను వేరే హీరోల అభిమానులు పనిగట్టుకుని చంపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు పెద్ద హీరోల అభిమానులే ‘కంగువ’ ఫెయిల్యూర్‌కు కారణమని ఆయన అన్నారు. ఆ ఇద్దరు హీరోల అభిమానులకు రెండు రాజకీయ పార్టీల అండ ఉందని.. వాళ్లకు సూర్య మీద ఉన్న ద్వేషం వల్ల పనిగట్టుకుని ‘కంగువ’ మీద నెగెటివ్ ప్రచారం చేశారని.. దాని వల్ల జనాల్లో సినిమా మీద ప్రతికూల అభిప్రాయం ఏర్పడి థియేటర్లకు రాలేదని ధనంజయన్ అన్నారు. సూర్య ఉన్నత స్థాయికి ఎదడం ఈ హీరోల అభిమానులకు ఇష్టం లేదని... అందుకే ఆయన సినిమాలను టార్గెట్ చేస్తున్నారని ధనంజయన్ ఆరోపించారు. ‘కంగువ’ రిలీజ్‌కు ముందు, తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివ్ క్యాంపైనింగ్ జరిగిన మాట వాస్తవం. ఐతే ఈ ఒరవడి టాలీవుడ్లోనూ ఉంది. చాలామంది హీరోలు ఈ నెగెటివిటీతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.