Begin typing your search above and press return to search.

నయన్ తో వివాదం.. ధనుష్ తండ్రి ఏమన్నాడంటే?

ట్రైలర్ లో 3 సెకండ్ల బీటీఎస్ వీడియో పెట్టినందుకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ లీగల్ నోటీస్ పంపినట్లు నయన్ మూడు పేజీల లేఖ రాసింది.

By:  Tupaki Desk   |   20 Nov 2024 8:31 AM GMT
నయన్ తో వివాదం.. ధనుష్ తండ్రి ఏమన్నాడంటే?
X

సౌత్ స్టార్స్ ధనుష్, నయనతార మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయేమో తెలియదు కానీ.. ఇటీవల వీరి మధ్య వెలుగులోకి వచ్చిన వివాదం మాత్రం గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన డాక్యుమెంటరీలో 'నేనూ రౌడీనే' సినిమా విజువల్స్ వాడుకోడానికి అనుమతి ఇవ్వలేదంటూ ధనుష్ పై నయన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ట్రైలర్ లో 3 సెకండ్ల బీటీఎస్ వీడియో పెట్టినందుకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ లీగల్ నోటీస్ పంపినట్లు నయన్ మూడు పేజీల లేఖ రాసింది. దీనిపై ధనుష్ స్పందించలేదు కానీ, తాజాగా ఆయన తండ్రి రియాక్ట్ అయ్యారు.

నయనతార సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓపెన్ లెటర్‌పై ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందిస్తూ.. తాము పనిపైనే ఎక్కువ దృష్టి పెట్టామని, ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పడానికి తమకు సమయం లేదని అన్నారు. ''మాకు పని ముఖ్యం. మేము ముందుకు సాగుతున్నాము. మమ్మల్ని వెంబడించే వారికి సమాధానం చెప్పడానికి లేదా మా వెనుక జరిగే విషయాల గురించి మాట్లాడటానికి మాకు సమయం లేదు. నాలాగే, నా కొడుకు కూడా తన పనిపై మాత్రమే దృష్టి పెడతాడు'' అని కస్తూరి రాజా తెలిపారు.

ధనుష్ పది కోట్లు డిమాండ్ చేసారని, తన డాక్యుమెంటరీ విడుదలను రెండేళ్లుగా ఆలస్యం చేశారని నయనతార చేసిన ఆరోపణలపై ప్రశ్నించగా.. దానిపై తాను కామెంట్స్ చెయ్యాలని అనుకోవడం లేదని కస్తూరి రాజా పేర్కొన్నారు. ధనుష్ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ బహిరంగ లేఖలో నయన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ''డియర్ మిస్టర్ ధనుష్ కె రాజా, S/o కస్తూరి రాజా, B/o సెల్వరాఘవన్.. మీ నాన్నగారి ఆశీస్సులతో, ఏస్ డైరెక్టర్ అయిన మీ సోదరుడి సపోర్ట్ తో ఇండస్ట్రీలో యాక్టర్ గా స్థిరపడిన మీరు ఈ లెటర్ చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను'' అంటూ బ్యాగ్రౌండ్ ఉండటం వల్లనే ధనుష్ చిత్ర పరిశ్రమలో సెటిల్ అయ్యారనే విధంగా వ్యాఖ్యానించింది.

ధనుష్ నిర్మాణంలో రూపొందిన 'నేనూ రౌడీనే' సినిమా పాటలు ఫోటోలను తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఉపయోగించుకోడానికి అనుమతి నిరాకరించాడని, రెండేళ్లు తిప్పుకొని ఎన్ఓసీ ఇవ్వలేదని నయనతార ఆరోపించింది. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' ట్రైలర్‌లో ఉపయోగించిన ' నానుమ్ రౌడీ ధాన్' BTS క్లిప్‌ను తీసివేయమని ధనుష్ లాయర్ నోటీస్ పంపినట్లు ఆమె వెల్లడించింది. వీడియో క్లిప్పింగ్స్ తొలగించకపోతే రూ. 10 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారని తెలిపింది. ఇక్కడే ధనుష్ క్యారక్టర్ ఏంటో తెలిసిపోతోందని, ఇంతగా దిగజారిపోతాడని అనుకోలేదని తీవ్ర విమర్శలు చేసింది. 'ఓం నమః శివాయ' అంటూ ధనుష్ కొలిచే శివుడ్ని ప్రస్తావిస్తూ లేఖను ముగించింది. దీనిపై ధనుష్ లాయర్ స్పందిస్తూ.. “తెర వెనుక ఫుటేజ్ అయినా సినిమా నిర్మాతగా నా క్లయింట్‌కే చెందుతుంది” అని పేర్కొన్నారు. ధనుష్ తండ్రి మాత్రం నయన్ కామెంట్స్ పై మాట్లాడటానికి ఇష్టపడలేదు.

ఇకపోతే 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ నవంబర్ 18న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇది అమిత్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కింది. నయన్ ఫ్యామిలీ వివరాలు, సినీ జర్నీ, కెరీర్ బ్రేక్, డేటింగ్ లైఫ్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం, పెళ్లి బంధంలో అడుగుపెట్టడం వంటి అంశాలను ఈ డాక్యుమెంటరీలో కవర్ చేసారు. దీని కోసం ఓటీటీతో నయనతార దంపతులు కొన్ని కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు టాక్.