Begin typing your search above and press return to search.

నయనతార-ధనుష్ వివాదం.. సాగుతున్న సస్పెన్స్!

తాజాగా ఈ కేసు కోర్టు విచారణకు వచ్చింది. జడ్జి ఈ వ్యవహారాన్ని పరిశీలించి, తదుపరి విచారణను 2025 జనవరి 22కు వాయిదా వేశారు.

By:  Tupaki Desk   |   10 Jan 2025 3:30 PM GMT
నయనతార-ధనుష్ వివాదం.. సాగుతున్న సస్పెన్స్!
X

కోలీవుడ్‌లో నటుడు ధనుష్, నటి నయనతార మధ్య జరుగుతున్న వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. నయనతార, విగ్నేష్ శివన్ కి సంబంధించిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఆ మధ్య విడుదలైన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీధాన్ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఉపయోగించారు. ఇది తమ అనుమతి లేకుండా చేసినదని ధనుష్ ఆరోపించారు.

దీనికి సంబంధించి రూ. 5 కోట్ల పరిహారం కోరుతూ ధనుష్ న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు. ధనుష్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఈ వివాదం గురించి నయనతార బహిరంగ లేఖలో తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. ఆమె తాము ఎలాంటి తప్పు చేయలేదని, తప్పకుండా న్యాయపరంగా పోరాడతామని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించిన వివిధ కోణాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.

ఫ్యాన్స్ మధ్య కూడా వాగ్వాదాలు జరుగుతుండగా, ఈ కేసు కోలీవుడ్ పరిశ్రమలో గందరగోళానికి దారితీసింది. తాజాగా ఈ కేసు కోర్టు విచారణకు వచ్చింది. జడ్జి ఈ వ్యవహారాన్ని పరిశీలించి, తదుపరి విచారణను 2025 జనవరి 22కు వాయిదా వేశారు. ధనుష్ చేసిన న్యాయపరమైన ఆరోపణలను, నయనతార వైపు నుండి సమర్పించిన వివరణలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తీర్పు వచ్చే అవకాశముందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

ఈ మేరకు కోర్టు తాజా నిర్ణయం రెండు వర్గాల్లోనూ ఉత్కంఠను పెంచింది. ఇక ఈ వివాదం నేపథ్యంలో ధనుష్, నయనతార అభిమానులు సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు చేస్తున్నారు. నయనతార భర్త విగ్నేష్ శివన్, ఈ అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ, వివాదాలకి దూరంగా ఉండటానికి ఆమధ్య తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేయడం మరో చర్చకు దారితీసింది.

ఆయన నిర్ణయానికి కారణం ట్రోలింగ్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. వివాదం ఎంతగా ముదురుతున్నా, నయనతార మరియు ధనుష్ తమ ప్రాజెక్టుల మీదే దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి, కోర్టు తీర్పు మాత్రమే ఈ వివాదానికి ముగింపు పలుకుతుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. అందరూ ఆసక్తిగా 22వ తేదీని ఎదురుచూస్తున్నారు. మరి ఈ సస్పెన్స్ ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.