Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ మూవీలో ఐపీఎల్‌, ధోనీ.. అసలు మ్యాటర్ ఇదే

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక 'ది గోట్‌' చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   4 Sep 2024 3:59 AM GMT
సూపర్‌ స్టార్‌ మూవీలో ఐపీఎల్‌, ధోనీ.. అసలు మ్యాటర్ ఇదే
X

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక 'ది గోట్‌' చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళనాడులోని దాదాపు అన్ని సింగిల్ స్క్రీన్‌ థియేటర్లతో పాటు, మల్టీప్లెక్స్ ల్లోని అన్ని స్క్రీన్స్ ల్లో కూడా ది గోట్‌ ను స్క్రీనింగ్ చేసే విధంగా ప్లాన్‌ చేశారు. తద్వారా రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్‌ కలెక్షన్స్ ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ది గోట్ సినిమా ప్రారంభం మొదలుకుని తమిళ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూనే ఉంది. సినిమా గురించి వచ్చిన ప్రతి వార్త సినిమా స్థాయిని పెంచింది అనడంలో సందేహం లేదు.

ది గోట్ సినిమాలో టీం ఇండియా మాజీ కెప్టెన్‌, ఐపీఎల్‌ స్టార్ ఎంఎస్‌ ధోనీ గెస్ట్‌ అప్పియరెన్స్ ఉంటుందని, ఆయన కనిపించిన కొన్ని నిమిషాలు సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో తమిళ తంబీలు తెగ ప్రచారం చేస్తున్నారు. సినిమా విడుదల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన దర్శకుడు వెంకట్‌ ప్రభు జరుగుతున్న ప్రచారం పై స్పందించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ... విజయ్‌, ధోనీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ది గోట్ సినిమాలో ధోనీని నటింపజేయాలని భావించాం. కానీ అది వర్కౌట్‌ అవ్వలేదు.

విజయ్‌ ఫ్యాన్స్ తో పాటు అంతా అనుకుంటున్నట్లు ది గోట్‌ లో ధోనీ కనిపించబోవడం లేదు. అయితే సినిమా కథలో భాగంగా ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌ ఇంకా చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ సందర్భంగా పలువురు ఐపీఎల్‌ ఆటగాళ్ల ఫోటోలను, పాత వీడియోలు చూపించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతే కానీ ఏ క్రికెటర్‌ ను సినిమాలో నటింపజేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు వెంకట్‌ ప్రభు ప్రకటనతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు, తమిళ సినీ ప్రేమికులు అంతా కూడా ఉసూరుమంటున్నారు. ది గోట్ లో ధోనీ కనిపిస్తే సినిమా స్థాయి రెట్టింపు అయ్యేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. ది గోట్ విజయ్‌ కి చివరి సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పైగా ఈ సినిమా లో విజయ్ ను తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్‌ లో చూడబోతున్నాం. తమిళనాడు తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ది గోట్ ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగు లో ఈ సినిమాకు అంతగా బజ్ క్రియేట్‌ అవ్వలేదు. విడుదల తర్వాత ఏమైనా పరిస్థితి మారేనా చూడాలి. విజయ్ కి జోడీగా ఈ సినిమాలో గుంటూరు కారం ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి హీరోయిన్‌ గా నటించింది. ఇంకా ఈ సినిమాలో ప్రశాంత్, లారెన్స్‌, మాళవిక శర్మ, ప్రభుదేవాలు కనిపించబోతున్నారు.