కోలీవుడ్ స్టార్ సినిమాకు ఇంత అవమానమా..?
కొన్ని సినిమాలు ఎంత పెద్ద క్రేజీ కాంబినేషన్ అయినా సరే ఎన్నో భారీ అంచనాలతో మొదలైనా ఆ సినిమా ఏవో కారణాల వల్ల లేట్ అవుతూ ఉంటాయి
By: Tupaki Desk | 16 Nov 2023 8:28 AMకొన్ని సినిమాలు ఎంత పెద్ద క్రేజీ కాంబినేషన్ అయినా సరే ఎన్నో భారీ అంచనాలతో మొదలైనా ఆ సినిమా ఏవో కారణాల వల్ల లేట్ అవుతూ ఉంటాయి. అంతేకాదు కొన్ని కాంబినేషన్స్ అయితే మొదలు పెట్టడం బాగానే మొదలు పెట్టినా అవి ముందుకు వెళ్లలేక మధ్యలో ఆగిపోతాయి. అలా ఒకరు ఆపేసిన ప్రాజెక్ట్ మరొకరు చేయాల్సి వస్తుంది. ఇదంతా దేని గురించి అని మీరు అనుకోవచ్చు. తమిళ స్టార్ డైరెక్టర్ గౌతం మీనన్ తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమే. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకున్న గౌతం మీనన్ సినిమాలకు ఇక్కడ కూడా క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు.
అలాంటి డైరెక్టర్ ఎందుకనో కెరీర్ పరంగా వెనక్కి వెళ్లాడు. డైరెక్టర్ గా కెరీర్ స్ట్రాంగ్ ఉన్న టైంలో గ్రాఫ్ తగ్గిపోయేలా చేసుకున్న గౌతం మీనన్ ఈమధ్య యాక్టర్ గా మారి సినిమాలు చేస్తున్నాడు. అయితే గౌతం మీనన్ డైరెక్షన్ లో 2013 లో సూర్యతో ఒక సినిమా మొదలైంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సినిమా నిలిపివేయబడింది. అదే ప్రాజెక్ట్ ని 2015 లో విక్రం తో మొదలు పెట్టాడు గౌతం మీనన్. అదే ధృవ నక్షత్రం. ఆ సినిమాను ఎనిమిదేళ్లుగా చెక్కుతూనే ఉన్నారు.
సినిమా మొదలైనప్పటి నుంచి ఆర్ధిక సమస్యల కారణంగా కొన్నాళ్లు ఆగిపోయింది. అయితే నిర్మాతతో పాటుగా గౌతం ఈ ప్రాజెక్ట్ ని ఎలాగైనా పూర్తి చేయాలని సొంత డబ్బు కూడా పెట్టుకున్నాడు. బయట నుంచి తెచ్చి మరీ ఆ సినిమాకు ఇన్వెస్ట్ చేశాడు గౌతం మీనన్. అయినా సరే సినిమాను పూర్తి చేయలేకపోయారు.
ఈ గ్యాప్ లో నిర్మాతలతో గొడవ వారితో వచ్చిన విభేదాల వల్ల సినిమా మరింత లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ సినిమాను నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతం మీనన్ సినిమా గురించి చెప్పారు. సినిమా పూర్తయ్యాక కూడా రిలీజ్ అయ్యాక ఏళ్లకు ఏళ్లు ఆగిపోతే ఆ సినిమాకు పెద్దగా బిజినెస్ జరగదు.
విక్రం ఈ సినిమాను ఎప్పుడో వదిలేశాడు. ఇక మరో 10 రోజుల్లో రిలీజ్ అవుతున్న ధృవ నక్షత్రం సినిమా ఓటీటీ బిజినెస్ ఇంకా జరగలేదని తెలుస్తుంది. ఆగిపోయిన సినిమాకు ఓటీటీ డీల్ కూడా నెమ్మదిగా జరుగుతుంది. ఒకవేళ సినిమా రిలీజ్ తర్వాత కంటెంట్ బాగుండి ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకుంటే ఏమన్నా ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపిస్తాయేమో కానీ రిలీజ్ ముందు మాత్రం ఇలాంటి సినిమాలకు బిజినెస్ ఛాన్స్ లేదు. మరి ధృవ నక్షత్రం గౌతం మీనన్ నమ్మకాన్ని నిలబెడుతుందా లేదా అన్నది చూడాలి.