ట్రైలర్: గౌతమ్ మీనన్ మార్క్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ కల్ట్ జానర్ లో స్టైలిష్ యాక్షన్ చిత్రాలతో పాపులరైన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 25 Oct 2023 4:39 AM GMTప్రముఖ కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ కల్ట్ జానర్ లో స్టైలిష్ యాక్షన్ చిత్రాలతో పాపులరైన సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరీస్ ని ఎంత అందంగా తెరకెక్కించగలడో, అంతకుమించి స్టైలిష్ యాక్షన్ క్రైమ్ చిత్రాలను రూపొందించడంలోను అతడికి ప్రత్యేకత ఉంది. విక్టరీ వెంకటేష్ ని ఘర్షణలో ఎంతో స్టైలిష్ గా ఆవిష్కరించిన గౌతమ్ మీనన్.. 'రాఘవన్'లో కమల్ హాసన్ ని ఎంతవాడు కానీలో అజిత్ ని అంతే స్టైలిష్ గా చూపించాడు. ఇప్పుడు చియాన్ విక్రమ్ తో 'ధృవ నచ్చతిరమ్' ఇదే కేటగిరీ. ఈ చిత్రం ఎట్టకేలకు నవంబర్ 24 న పెద్ద స్క్రీన్‌లను అలంకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం ధృవ నట్చతిరం: మొదటి అధ్యాయం - యుద్ధ కాండమ్ విడుదలకు రెడీ. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
సంఘం నుంచి ప్రమాదకర క్రిమినల్ గ్యాంగ్స్ ని ఏరిపారేసేవాడిగా చియాన్ విక్రమ్ ఈ చిత్రంలో నటించారు. సాంప్రదాయిక నియమాలకు కట్టుబడక తమ లక్ష్యాలను సాధించడంలో తిరుగులేని టీమ్ (బేస్‌మెంట్)తో చియాన్ ఏం చేసాడన్నదే ఈ సినిమా. చియాన్ విక్రమ్ బేస్ మెంట్ టీమ్ లో ముఖ్యుడు. ప్రత్యేకమైనవాడు. అయితే ట్రైలర్ లో బేస్ మెంట్ టీమ్ ఎజెండా ఏమిటన్నది పూర్తిగా రివీల్ చేయలేదు.
ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు రక్తి కట్టించాయి. విజువల్ గాను గ్రాండియర్ గా ఉంది. ఇక చిత్రకథానాయకుడు విక్రమ్ ని ఎంతో స్టైలిష్ గా ఆవిష్కరించిన గౌతమ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని గౌతమ్ ఆవిష్కరించారు. ఇందులో అతడు భారీ డైలాగ్స్ తో అతిథి పాత్రలో కనిపించడం ఆసక్తిని కలిగించింది.
ఈ చిత్రంలో చియాన్ సరసన రీతూ వర్మ రొమాన్స్ చేసింది. పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్, దివ్యదర్శిని ముఖ్య పాత్రల్లో నటించారు. గౌతమ్ మీనన్ ఆస్థాన విధ్వాంసుడు హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అతడు అందించిన రీరికార్డింగ్ ఎంతో పెప్పీగా ఎనర్జిటిక్ గా ఉంది. నవంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఎనిమిదేళ్లకు ఎట్టకేలకు:
నిజానికి గౌతమ్ మీనన్ ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. బహుభాషా చిత్రంగా దీనిని రూపొందించేందుకు అతడు ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడని ప్రచారమైంది. కారణమేదైనా కానీ, ఈ సినిమా రిలీజ్ చాలా ఆలస్యైంది. ఒక సినిమా చిత్రీకరణ దశలోనే ఎనిమిదేళ్లు వెయిటింగ్ మోడ్ లో ఉంది అంటే దాని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆలస్యమైనా కానీ ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్ అంత ఉత్కంఠభరితంగా అలరిస్తోంది.