వేసుకునేది ఖరీదైన బట్టలు.. తినేది మాత్రం నూడుల్స్
మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన బాలీవుడ్ నటి దియా మీర్జా మాజీ మిస్ ఆసియా ఫసిఫిక్ ఇంటర్నేషనల్2001 విన్నర్ అనే విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 March 2025 4:00 PM ISTమోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన బాలీవుడ్ నటి దియా మీర్జా మాజీ మిస్ ఆసియా ఫసిఫిక్ ఇంటర్నేషనల్2001 విన్నర్ అనే విషయం తెలిసిందే. సమాజ సేవ చేస్తూ ఎక్కువగా గుర్తింపు దక్కించుకున్న దియా మీర్జా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ దియా హీరోయిన్ గా పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా దియా మీర్జా తాను మోడలింగ్ లోకి వచ్చిన కొత్తల్లో తాను పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడింది. మొదట్లో తాను డబ్బు లేక చాలా ఇబ్బంది పడ్డానని, ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది కాదని, చాలీచాలని డబ్బుతో జీవితాన్ని నెట్టుకొచ్చినట్టు తెలిపింది దియా మీర్జా.
2000వ సంవత్సరంలో తాను, లారా దత్తా, ప్రియాంక చోప్రా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నామని ఆమె చెప్పింది. ప్రియాంకకు తన ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉండేదని, లారా దత్తాకు, తనకు ఇంట్లో వారి సపోర్ట్ ఉండేది కాదని చెప్పింది. మోడలింగ్ చేస్తున్న టైమ్ లో ముంబైలో ఓ చిన్న రూమ్ లో లారా రెంట్ కు ఉండేదని, తాను ముంబైకు వచ్చినప్పుడు లారా చాలా హెల్ప్ చేసేదని, లారా ఇంట్లోనే తాను కూడా ఉండేదని చెప్పింది.
చిన్న ఇల్లు అయినప్పటికీ ఇద్దరం అందులోనే అడ్జస్ట్ అయిపోయేవాళ్లమని, ఫ్యాషన్ షో లో పాల్గొనడానికి ఖరీదైన బట్టలు వేసుకున్నప్పటికీ తినడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండేది కాదని, నూడుల్స్ తిని కడుపు నింపుకునే వాళ్లమని, వేసుకునేది ఖరీదైన బట్టలు, తినేది మాత్రం నూడుల్స్ అని తమ పరిస్థితిని చెప్పుకుని తాను, లారా నవ్వుకునేవాళ్లమని దియా మీర్జా ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంది.
మిస్ ఇండియా పోటీల్లో లారా దత్తా విన్నర్ గా నిలవగా, ఫస్ట్ రన్నరప్ గా ప్రియాంక చోప్రా, సెకండ్ రన్నరప్‌గా దియా మీర్జా నిలిచారు. 2001లో రెహ్నా హై తేరే దిల్ మే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దియా మీర్జా ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. 2021లో నాగార్జున తో కలిసి వైల్డ్ డాగ్ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయైన దియా మీర్జా మోడల్‌గా, నటిగా, నిర్మాతగా అన్నింటికీ మించి సమాజ సేవకురాలిగా బాగా గుర్తింపు దక్కించుకుంది.