ట్రెండీ టాక్: వికటించిన అభిమాని పిచ్చి
ఆమె కూడా కన్నీటి పర్యంతమై ఇలాంటి కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ల దూకుడు తగ్గించాలని అభ్యర్థించింది
By: Tupaki Desk | 13 Oct 2024 12:30 AM GMTతండ్రి శవం దగ్గర ఏడుస్తుంటే ఒకడు వచ్చి హీరోని సెల్ఫీ అడిగాడట. గతంలో ఓ తెలుగు యువహీరో పబ్లిగ్గా వాపోయి ఏకంగా `సెల్ఫీ` పిచ్చిపైనే సినిమా తీశాడు. అదంతా అటుంచితే ఓ సందర్భంలో పిల్లల కార్యక్రమంలో వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఐశ్వర్యారాయ్ ఆమె కుమార్తె ఆరాధ్య వెంట పడ్డారు స్టిల్ ఫోటోగ్రాఫర్లు. ఆ సందర్భంలో ఒక చిన్నారి ఏడుపు అందుకోవడంతో అది ఐశ్వర్యారాయ్ ని కలచివేసింది. ఆమె కూడా కన్నీటి పర్యంతమై ఇలాంటి కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ల దూకుడు తగ్గించాలని అభ్యర్థించింది. ప్రవర్తన నేర్చుకోవాలని కూడా కోరింది.
ఇప్పుడు ఇది ఒక భిన్నమైన సందర్భం. అసలే ఆ స్టార్ హీరో స్టిల్ ఫోటోగ్రాఫర్ల ముట్టడితో చాలా చికాగ్గా ఉన్నాడు. గాళ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అంటూ ప్రచారం చేసిన అదే మీడియా జనం తమ వెంట పడి మరీ ఫోటోలు తీస్తుంటే అది అతడికి చికాకుగా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలో సందట్లో సడేమియాలాగా ఒక అభిమాని వారి మధ్యకు దూరాడు. హీరోతో ఒక ఫోటోగ్రాఫ్ కావాలి ప్లీజ్ అని అడిగాడు. అసలే ఆ సందర్భం బ్యాడ్. దీంతో మూడ్ చెడిపోయిన హృతిక్ ఆ అభిమానిపై విరుచుకుపడ్డాడు. హృతిక్ అసలే కోపంగా ఉన్నప్పుడు అభిమాని కోరిక రివర్సయి చీవాట్లు తినడానికి కారణమైంది.
ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయి దీనిపై డిబేట్లు పెడుతున్నారు. హృతిక్ కి స్టార్‌డమ్‌ను నెత్తికెక్కిందని కొందరు విమర్శిస్తే, అబ్బే సెలబ్రిటీలకు ప్రైవసీ ముఖ్యం అని సమర్థించిన వారు లేకపోలేదు. హృతిక్- ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వార్ రాక కోసం అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు అంతా తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద నగరాలకు దిగొచ్చి ప్రచారం చేస్తున్నారు. తారక్ చొరవతో హృతిక్ కూడా హైదరాబాద్- వైజాగ్ లాంటి చోట్ల ప్రచారానికి దిగొస్తాడేమో చూడాలి. ఇంకా సదరు ఉత్తరాది హీరో దక్షిణాదిని, అలాగే తెలుగు రాష్ట్రాలను తక్కువ చూపు చూడడనే అనుకుందాం ఇప్పటికి.