జాతీయ ఉత్తమ నటికి అందరూ సిస్టర్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారట!
ఇటీవల జరిగిన 70వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో 'ఉత్తమ నటి'గా పురస్కారం అందుకొని జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది.
By: Tupaki Desk | 20 Oct 2024 3:45 AM GMT'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాలో విక్కీ కౌశల్‌కు సోదరిగా నటించి అందరినీ ఆకట్టుకుంది మానసి పరేఖ్. ఇటీవల జరిగిన 70వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో 'ఉత్తమ నటి'గా పురస్కారం అందుకొని జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మానసి.. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడింది. అలానే బాలీవుడ్ లో మళ్ళీ సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది.
'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమా తర్వాత అందరూ తనకు సిస్టర్ రోల్స్ కోసమే సంప్రదించారని, అందుకే బాలీవుడ్ పై ఆసక్తి చూపించలేదని మానసి పరేఖ్ తెలిపింది. ఉరి తర్వాత నేను కొన్ని సినిమాలను ప్రొడ్యూసింగ్ చేశాను. అయినా హిందీలో నాకు అన్నీ సోదరి పాత్రలే వచ్చాయి. నేను ఆ క్యారక్టర్ కు మించి చేయగలనని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందుకే బీటౌన్ పై ఇంట్రెస్ట్ పోయింది. నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ ను కాబట్టి గొప్ప పాత్రలు క్రియేట్ చేసుకోగలను అని మానసి చెప్పింది.
కెరీర్ బిగినింగ్ డేస్ గుర్తు చేసుకుంటూ.. ఆడిషన్స్ కోసం ఎంత దూరమైనా వెళ్లేదాన్ని అని, ఎంత కష్టమైనా ఆడిషన్ ఇచ్చిన తర్వాతే ఇంటికి వెళ్ళేదాన్నని తెలిపింది. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానని, మనం చేసే పోరాటాలే మనల్ని నిర్వహిస్తాయని చెప్పింది. అన్ని ఫైట్స్ చేసి కష్టపడటం వల్లనే ఈ స్థాయిలో ఉన్నాను. కష్టాల తర్వాత వచ్చే సక్సెస్ మరింత మధురంగా ఉంటుంది. అప్పుడే మనం ప్రతీ క్షణాన్ని ఆస్వాదించగలుగుతాం అని తెలిపింది. మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలమని చెప్పుకొచ్చింది మానసి.
మానసి పరేఖ్ ముంబైలో పుట్టి పెరిగిన గుజరాతీ యువతి. నటిగానే కాకుండా.. గాయనిగా, నిర్మాతగా, కంటెంట్ క్రియేట్ గా మల్టీటాలెంటెడ్ అనిపించుకుంది. 2003లో పాప్ స్టార్ (సీజన్ 2)లో హీరో ఆయుష్మాన్ ఖురానాతో పాటు 8 మంది ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది. 2004లో కిత్నీ మస్త్ హై జిందగీ అనే సీరియల్‌లో తొలిసారిగా నటించింది. ఇండియా కాలింగ్ సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకుంది. జీ టీవీలో 'స్టార్ యా రాక్‌స్టార్' అనే సింగింగ్ రియాలిటీ షోలో విన్నర్ గా నిలిచింది. 2008లో ఆమె పార్థివ్ గోహిల్ అనే మ్యూజిషియన్ ను పెళ్ళి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది.
పెళ్లి తర్వాత 2012లో 'లీలై' అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ కు పరిచయమైంది మానసి పరేఖ్. అయితే ఆ తర్వాత సినిమా అవకాశాలు రాలేదు. 2019లో వచ్చిన 'ఉరి: ది సర్జికల్ స్ట్రయిక్' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇదే క్రమంలో నిర్మాతగా మారి, తన స్వీయ నిర్మాణంలో పలు గుజరాతీ సినిమాలు నిర్మించింది. 2023లో 'కచ్ ఎక్స్‌ప్రెస్' అనే గుజరాతీలో అధ్బుతమైన నటనకు గాను ఆమెకు ఉత్తమ నటిగా నేషనల్ ఫిలిం అవార్డ్ దక్కింది.