Begin typing your search above and press return to search.

మెగా ఫ్లాపులు.. అసలు లోపం ఎక్కడ జరుగుతోంది?

ఇప్పటికే మూడు ఫ్లాప్ లతో సతమతమవుతుండగా.. ఇప్పుడు లేటెస్టుగా ఈ లిస్టులోకి 'మట్కా' రూపంలో నాలుగో ఫ్లాప్ వచ్చి చేరింది.

By:  Tupaki Desk   |   17 Nov 2024 3:00 AM GMT
మెగా ఫ్లాపులు.. అసలు లోపం ఎక్కడ జరుగుతోంది?
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి నుంచీ వైవిధ్యమైన సినిమాలే చేయగానే ట్రై చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని విజయాలు ఎదురైతే, మరికొన్ని పరాజయాలు పలకరించాయి. అయితే గత కొన్నేళ్లుగా మెగా హీరోకి సరైన సక్సెస్ దక్కడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన విజయం మాత్రం అందడం లేదు. సోలోగా హిట్టు కొట్టి చాలా కాలమే అయింది. ఇప్పటికే మూడు ఫ్లాప్ లతో సతమతమవుతుండగా.. ఇప్పుడు లేటెస్టుగా ఈ లిస్టులోకి 'మట్కా' రూపంలో నాలుగో ఫ్లాప్ వచ్చి చేరింది.

వరుణ్ తేజ్ నటించిన పాన్ ఇండియా మూవీ 'మట్కా' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రీరిలీజ్ బజ్ అంతగా లేకపోవడం వల్ల బుకింగ్స్ కూడా సరిగా జరగలేదు. టాక్ బాగుంటే జనాలు థియేటర్లకు వస్తారని అంతా భావించారు. కానీ అలా కూడా జరగలేదు. దీంతో ఓపెనింగ్స్ మరీ దారుణంగా వచ్చాయి. వీకెండ్స్ లో కూడా కనీస వసూళ్లు రాబట్టలేకపోతోంది. ఇది మెగా ఫ్యాన్స్ కు షాకింగ్ గా అనిపిస్తోంది.

'మట్కా' సినిమాతో వరుణ్ తేజ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని అనుకున్నారు. వరుణ్ సైతం ఈసారి చాలా ధీమాగా ఉన్నారు. మంచి సినిమాతో వస్తున్నానని అభిమానులకు ప్రామిస్ కూడా చేశారు. కానీ ఈ చిత్రం అందరినీ తీవ్రంగా నిరాశ పరిచింది. తెలుగుతో పాటుగా ఇతర భాషల్లోనూ ఈ సినిమా పరిస్థితి అలానే ఉంది. వరుణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం.. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చేలా ఉంది.

నిజానికి వరుణ్ తేజ్ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూ రొటీన్ మాస్ మసాలా సినిమాలేవీ చేయడం లేదు. మాస్ హీరో అనిపించుకోడానికి తగ్గ కటౌట్ ఉన్నా.. ఏదైనా భిన్నమైన కంటెంట్ తోనే రావాలని అనుకున్నాడు. వేటికవే భిన్నమైన కథలతో 'గాండీవధారి అర్జున', 'గని', 'ఆపరేషన్ వాలెంటైన్‌' లాంటి సినిమాలు చేశాడు కానీ.. బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు 'మట్కా' వంటి పీరియడ్ యాక్షన్ డ్రామా చేసినా పరాజయమే పలకరించింది.

వరుణ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ ను పరిశీలించినట్లయితే, ప్రేక్షకులు ఎక్కువగా రొమాంటిక్ లవ్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలోనే అతన్ని ఇష్టపడ్డారు. యాక్షన్ ఓరియెంటెడ్ రోల్స్ లో అతన్ని పెద్దగా ఆదరించడం లేదు. 'కంచె', 'ఫిదా', 'తొలి ప్రేమ', 'ఎఫ్ 2' 'ఎఫ్ 3' లాంటి చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి. కాబట్టి ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా, తన స్ట్రాంగ్ జోన్ లో ట్రెండ్ కు తగ్గట్టుగా వరుణ్ సినిమాలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే వరుణ్ తేజ్ ఇప్పటికే కమిటైన ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉందని అంటున్నారు. ముందుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ చేయనున్నారు. ఇండియన్ సినిమాలో హార్రర్ కామెడీలు ఇప్పుడు హాట్ కేక్స్ కాబట్టి.. ఇది కచ్చితంగా వర్కవుట్ అవ్వొచ్చు. ఇక విక్రమ్ సిరికొండతో ఏఐ బేస్డ్ లవ్ స్టోరీ చేస్తున్నట్లు టాక్. ఇది న్యూ ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంటుందని తెలుస్తోంది. సో ఈ రెండు చిత్రాలతో మెగా ప్రిన్స్ బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు.