ఆ సూపర్ స్టార్లు ఇద్దరూ 'లైకా'ని ఈ రేంజ్ లో ముంచారా?
చిత్ర నిర్మాణ సంస్థ నిర్మాణం ప్రారంభించి ఈ ఏడాదితో పదేళ్లు పూర్తవుతుంది.
By: Tupaki Desk | 16 Oct 2024 9:30 AM GMTకోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ గురించి పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోలే టార్గెట్ గా సదరు నిర్మాణ సంస్థ సినిమాలు నిర్మిస్తుంది. అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. కోలీవుడ్లో ప్రయోగాత్మక నిర్మాణ సంస్థగానూ గుర్తింపు దక్కించుకుంది. అనతి కాలంలోనే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా ఎదిగింది. నిర్మాణ సంస్థగా, డిస్ట్రిబ్యూషన్ సంస్థగా లైకాకి మంచి పేరుంది. చిత్ర నిర్మాణ సంస్థ నిర్మాణం ప్రారంభించి ఈ ఏడాదితో పదేళ్లు పూర్తవుతుంది.
విజయ్ హీరోగా ముగరదాస్ దర్శకత్వంలో తొలి సినిమా `కత్తి` నిర్మించింది. అప్పటి నుంచి నిర్మాణ రంగంలో కొనసాగుతుంది. అయితే ఈ నిర్మాణ సంస్థకు సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ అతి పెద్ద నష్టాలు తెచ్చిన హీరోలుగా హైలైట్ అవుతున్నారు. హీరోలంతా ఒక ఎత్తైతే..వీరిద్దరు లైకాని నష్టాల్లోకి నెట్టిన హీరోలుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇటీవలే రజనీకాంత్ నటించిన `వెట్టేయాన్` చిత్రాన్ని ఇదే సంస్థ నిర్మించింది.
కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ చిత్రం ద్వారా రజనీ గత సినిమాలతో ఎదురైన నష్టాలను పూరించాలని భావించారు కానీ ఫలితం తారుమారు అయింది. ఇంతకు ముందు సంస్థలో రజనీకాంత్ నటించిన `దర్బార్`, `2.0` చిత్రాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. అవి తీవ్ర నష్టాల్నే మిగిల్చాయి. ఆ నష్టాలను వెట్టేయాన్ తో భర్తీ చేయాలని భావించారు కానీ పనవ్వలేదంటున్నారు. ఇదే సంస్థలో రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన `లాల్ సలామ్` కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది.
ఇందులో రజనీ ఓ కీలక పాత్ర సైతం పోషించిన సంగతి తెలిసిందే. ఇటీవలే కమల్ హాసన్ నటించిన `ఇండియన్ -2`ని కూడా ఇదే సంస్థ నిర్మించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా తొలి షోతోనే బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. దీంతో ఇండియన్ -3 ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలు మొదలయ్యాయి.