Begin typing your search above and press return to search.

వివాదంలో 'టాక్సిక్‌'.. షూటింగ్ కోసం చెట్లన్నీ నరికేశారా యష్?

ఇందులో భాగంగా అక్కడ భారీ సెట్లు ఏర్పాటు చేసారు. దీని కోసం ఆ ప్రాంతంలో చెట్లను నరికేశారనే ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది.

By:  Tupaki Desk   |   30 Oct 2024 9:47 AM GMT
వివాదంలో టాక్సిక్‌.. షూటింగ్ కోసం చెట్లన్నీ నరికేశారా యష్?
X

కన్నడ రాకింగ్ స్టార్ య‌ష్ ప్రస్తుతం ''టాక్సిక్'' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' ఫ్రాంచైజీ తరువాత పాన్ ఇండియా హీరో నటిస్తున్న సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌ దాస్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే బెంగళూరులో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేసిన మేకర్స్ కు షాక్ తగిలింది. ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. షూటింగ్‌ కోసం అక్కడి చెట్లన్నీ నరికేశారనే ఆరోపణలు రావడంతో, షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం 'టాక్సిక్‌' మూవీ షూటింగ్ ను బెంగళూరులోని HMT ల్యాండ్స్‌లో ప్లాన్ చేసారు. ఇందులో భాగంగా అక్కడ భారీ సెట్లు ఏర్పాటు చేసారు. దీని కోసం ఆ ప్రాంతంలో చెట్లను నరికేశారనే ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. దీంతో సంబంధిత అధికారులు రంగంలోకి దిగి, గతంలో శాటిలైట్‌ చిత్రాలను ఇప్పుడున్న పరిస్థితిని సమీక్షించారని నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాదు హెచ్‌ఎంటీ ప్రాంతంలో చెట్లు నరికేసినట్లు నిర్థారించుకున్నారని వార్తలు వచ్చాయి.

'టాక్సిక్‌' సెట్ల నిర్మాణం కోసం చెట్లను న‌రికివేయ‌డంపై కర్నాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీణ్య సమీపంలోని హెచ్‌ఎంటీ ప్లాంటేషన్‌లో రెండ్రోజుల పాటు షూటింగ్ జరిగిందని తెలుకున్న మంత్రి.. సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్‌ను పరిశీలించారు. హెచ్‌ఎంటీలో చెట్ల‌ నరికివేతకు అనుమతించిన వ్యక్తులపై అటవీ శాఖ నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని సమాచారం.

హెచ్‌ఎంటీలోని భూమిని ఇదివరకే రిజర్వ్‌ ఫారెస్టుగా ప్రకటించారని, దానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయిందని చినట్లు అధికారులు చెబుతున్నారు. HMT ఆధీనంలో ఉన్న ప్రాంతంలో అటవీయేతర కార్యకలాపాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ అనుమతులు లేకుండానే అక్రమంగా వివిధ సంస్థలు, ప్రైవేటు గ్రూపులకు, వ్యక్తులకు భూమిని అమ్మేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మిగిలి ఉన్న అటవీ భూమిని సినిమా షూటింగ్‌ల కోసం లీజుకు ఇస్తున్నారని ఇటీవలే త‌మ‌కు తెలిసిందని మంత్రి ఈశ్వర్ చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.

కర్ణాటక రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ నుండి సేకరించిన పాత చిత్రాలు, ఇటీవలి ఉపగ్రహ చిత్రాలను చూస్తే హెచ్‌ఎంటీ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో చెట్లను నరికివేసినట్లు కనిపిస్తుంది. అటవీ భూమిలో అనధికారికంగా చెట్ల నరికివేత శిక్షార్హమైన నేరమని అటవీ శాఖ మంత్రి హెచ్చరించినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. దీనిపై విచారణ చేసిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇకపోతే 'టాక్సిక్' వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రీత్ స్పందించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఇది ప్రైవేట్ ఆస్తి అని, అన్ని చట్టపరమైన అవసరాలకు కట్టుబడి ఉన్నామని, సంబంధిత పత్రాలను అటవీ శాఖకు సమర్పించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

నిజానికి HMT సంస్థ మూతపడడంతో, దాన్ని కెనరా బ్యాంకుకు విక్రయించారని తెలుస్తోంది. కాకపోతే ప్రైవేట్ ల్యాండ్ అయినా, ప్రభుత్వ భూమైనా చెట్లు నరికేయాలంటే అటవీశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మరి 'టాక్సిక్' టీం పర్మిషన్ తీసుకుందో లేదో తెలియాల్సి ఉంది. అయితే ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా షూటింగ్స్ కోసం చెట్లను నరికి ప్రకృతిని నాశనం చేయడం కరెక్ట్ కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం చిత్ర బృందానికి మద్దతుగా నిలుస్తున్నారు.

ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. ''బెంగళూరులోని HMT లేఅవుట్‌లో 'టాక్సిక్' టీం సెట్స్ నిర్మాణం కోసం చెట్లను నరికివేయడం గురించి ఆందోళన చెందడం నేను చూశాను. గూగుల్ ఎర్త్‌ని తనిఖీ చేసిన తర్వాత, 2012 నుండి ఈ లొకేషన్ చాలా వరకు ఖాళీగా ఉంది. ఇదేమీ దట్టమైన అడవి కాదు. ప్రకృతికి హాని జరగడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ప్రకృతిపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండటానికి బృందం ప్రత్యామ్నాయ స్థలాలను పరిగణించవచ్చు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. ప్రభుత్వం మళ్ళీ చెట్లను నాటడం ద్వారా ఈ ప్రాంతాన్ని పునరుద్ధరించాలని ప్లాన్ చేస్తారని ఆశిస్తున్నాము'' అని వ్యగ్యంగా పోస్ట్ పెట్టాడు.