రేణకా స్వామిని ఇంత ఘోరంగా టార్చర్ చేసారా?
విచారణ సమయంలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని నిందితులు స్పష్టం చేసారు.
By: Tupaki Desk | 16 Jun 2024 9:48 AM GMTఅభిమాని రేణుకా స్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్-పవిత్రాగౌడ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వాళ్లతో పాటు మరో తొమ్మింది మందికి తాజాగా న్యాయస్థానం పోలీస్ కస్టడీని పొడిగించింది. కస్టడీ అవధి సోమవారం వరకూ ఉన్నప్పటికీ బక్రీద్, తొలి ఏకాదశి కారణంగా సెలవులు ఉంటాయని భావించి పోలీసులు వారిని ముందుగానే కోర్టులో హాజరు పరుచామని తెలిపారు.
అంతకు ముందు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణ సమయంలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని నిందితులు స్పష్టం చేసారు. అనంతరం జూన్ 20 వరకూ పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం కోర్టు నుంచి నేరుగా అన్నపూర్ణేశ్వరినగర స్టేషన్ కు తరలించారు. అక్కడ నుంచి పవిత్ర ని సాంఘిక సంక్షేమ వసతి గృహానికి తరలించారు.
హత్యకు ముందు, అనంతరం నిందితుల వాట్సాప్, కాల్ హిస్టరీ, కాల్ డేటాని రాబట్టే ప్రయత్నాలు ఫోరెన్సిక్ నిపుణులు కొనసాగిస్తున్నారు. దర్శన్ ని న్యాయనిర్భందానికి పంపించే అవకాశం ఉండటంతో పరప్పన అగ్రహార కారాగారం వద్ద పోలీసులు ముందస్తుగా భద్రతని ఏర్పాటు చేసారు. ఇప్పటివరకూ 16 మందిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నట్లు ఆ వ్యక్తి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
రేణుకాస్వామి శాఖాహారి అని తెలిసినా నిందుతులకు అతనికి బలవంతంగా బిర్యానీ, ఎముకను నోట్లో పెట్టి తినిపించినట్లు పోలీసులు తెలిపారు. తినకుండా బయటకు ఉమ్మడంతో మళ్లీ కొట్టారని, మాంసం తింటే శక్తి వస్తుందని, బాస్ కొడితే తట్టుకోవచ్చు అని హేళన చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే హత్య చేసే ముందు విద్యుత్ షాక్ ఇచ్చారని పోలీసులకు గుర్తించారు.
మరోవైపు పౌర సంఘాల నుంచి నిందుతలను కఠినంగా శిక్షించాలని బెంగుళూరు, మండ్య, చిత్రదుర్గ, దావణ గెరె జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేణుకా స్వామి కుటుంబ సభ్యులకు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు 5 లక్షలు పరిహారం అందించారు. అలాగే నిందుతుల్లో ఒకరైన అనుకుమార్ ఇలాంటి వాడు అని తెలిసి అతడి తండ్రి చంద్రప్ప గుండెపోటుతో మరణించారు. చిత్ర దుర్గలో శనివారమే అతని అంత్యక్రియలు ముగిసాయి. అనూప్ కుమార్ పోలీస్ ల భద్రత మధ్య తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు.