రాజమౌళి, ప్రశాంత్ నీల్ మధ్య తేడా ఇదేనా?
ప్రభాస్ మాస్ యాక్షన్ ను చూసేందుకు అభిమానులు పోటీపడి మరీ థియేటర్లకు వెళ్తున్నారు.
By: Tupaki Desk | 24 Dec 2023 2:45 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగిస్తోంది. ఓపెనింగ్ వసూళ్లతో ఎన్నో రికార్డులను బద్దలగొడుతోంది. ప్రభాస్ మాస్ యాక్షన్ ను చూసేందుకు అభిమానులు పోటీపడి మరీ థియేటర్లకు వెళ్తున్నారు.
క్రిస్మస్ కానుకగా రిలీజైన ఈ సినిమాకు సినీ క్రిటిక్స్ మిక్స్ డ్ టాక్ అందించారు. కొందరు సినీ విమర్శకులు సలార్ ను పెర్ఫెక్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వర్ణించగా.. మరికొందరు చిన్న చిన్న లోపాలను బయటపెట్టారు. అయితే కేజీఎఫ్ రెండు పార్ట్ ల విడుదల తర్వాత.. సలార్ రిలీజ్ ముందు చాలా మంది ప్రశాంత్ నీల్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళితో పోల్చారు.
అయితే కన్నడ చిత్ర పరిశ్రమకు నెక్స్ట్ లెవల్ ను తీసుకెళ్లిన ఘనత ప్రశాంత్ నీల్ ది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ మూవీతోనే కన్నడ సినీ ఇండస్ట్రీ పేరు మార్మోగింది. ఈ సినిమాతోనే ప్రశాంత్ నీల్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు కూడా లభించింది.
మరోవైపు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.. బాహబలి పార్ట్-1, పార్ట్-2, ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆయన తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది. అనేక గ్లోబల్ అవార్డులను కూడా ఈ మూవీ సొంతం చేసుకుంది.
అయితే ప్రశాంత్ నీల్, రాజమౌళి మధ్య చిన్న డిఫెరెన్స్ ఉందని సినీ పండితులు చెబుతున్నారు. సినిమాలోని పాత్రలను, కథను పరిచయం చేయడంలో ఇద్దరి మధ్య తేడా ఉందని తెలిపారు. సినిమా రిలీజ్ కు ముందు కథ, పాత్రలను ప్రేక్షకులకు చిన్నగా పరిచయం చేస్తే మూవీ కోసం ఆడియెన్స్ ఫుల్ ప్రిపేర్ అవుతారని అంటున్నారు.
ఇండస్ట్రీలో రాజమౌళికి వంద శాతం సక్సెస్ రేటు ఉంది. తన సినిమాలపై జక్కన్న భారీ అంచనాలను నెలకొల్పుతారు. సినిమాలను పాత్రలను పరిచయం చేయడం ద్వారా సరైన రీతిలో అంచనాలను సెట్ చేస్తారు. అయితే ప్రశాంత్ నీల్ సక్సెస్ రేటు కూడా వంద శాతమే. కానీ సలార్ ఉన్న మూడు తెగలు- మన్నార్లు, శౌర్యంగాలు, ఘనియార్లను పరిచయం చేయడంలో నీల్ ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు.
సినిమా రిలీజ్ కు ముందు ఖాన్సార్ ప్రపంచం గురించి ఎలాంటి పరిచయం చేయలేదు ప్రశాంత్ నీల్. సినిమాలో కూడా ఆ మూడు తెగలను సెకాండాఫ్ లో పరిచయం చేశారు. దీంతో కొందరు ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. కొంతమంది మూవీ ట్రాక్ నుంచి కాస్త పక్కకు కూడా తప్పారు
ఇప్పుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్ మధ్య స్పష్టమైన తేడా ఇదేనని పలువురు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. జక్కన్న అయితే అదే తెగల విషయంలో కాస్త సింపుల్ గా అర్థమయ్యేలా ముందే పరిచయం చేస్తారని అంటున్నారు. రాజమౌళి తన సినిమాల్లో ఎమోషన్ బాగా పండిస్తారని, కానీ సలార్ లో ఎమోషన్ పండించడంలో నీల్ విఫలమయ్యారని చెబుతున్నారు. అయితే ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తుంటారని.. వేరే దర్శకుడితో పోల్చలేమని తెలిపారు.