'గేమ్ ఛేంజర్' పవన్ అయితే...!
తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు గేమ్ ఛేంజర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
By: Tupaki Desk | 8 Oct 2024 8:30 AM GMTరామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గేమ్ ఛేంజర్' సినిమా డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. గేమ్ ఛేంజర్ లో చరణ్ ను తండ్రి, కొడుకు పాత్రల్లో చూడబోతున్నాం. కొడుకు పాత్రకు జోడీగా కియారా అద్వానీ నటించగా, తండ్రి పాత్రకు జోడీగా అంజలి నటించింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. గేమ్ ఛేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దిల్ రాజు తమ బ్యానర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు గేమ్ ఛేంజర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు చూడాలి అనుకునే విధంగా ఉంటుంది. ఒక మంచి సోషల్ మెసేజ్ తో పాటు, కమర్షియల్ హంగులు ఉండే సినిమాగా గేమ్ ఛేంజర్ ఉంటుంది. ఈ సినిమా కథ గురించి మేనేజర్ ద్వారా నాకు తెలిసింది. శంకర్ గారి వద్ద కథ ఉన్న విషయం తెలిసింది. ఆయన వచ్చి 45 నిమిషాల్లో కథను చెప్పారు. కథ బాగా నచ్చింది. వెంటనే నేను చేద్దాం అనుకున్నాను. అయితే ఈ కథను తాను పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ నేను మాత్రం రామ్ చరణ్ తో ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఆయన నా మాటలతో ఏకీభవించారు. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ లో ఉన్న చరణ్ ను కలిశాం.
రామ్ చరణ్ ను కలిసి శంకర్ గారి వద్ద కథ ఉందని చెప్పాను. ఆయన శంకర్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. అలా గేమ్ ఛేంజర్ సినిమా పట్టాలెక్కిందని అన్నారు. గేమ్ ఛేంజర్ సినిమాను ఒకవేళ పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకు వెళ్లి ఉంటే ఆయన ఉన్న బిజీకి ఇప్పటి వరకు మొదలు అయ్యేదే కాదేమో. దిల్ రాజు మంచి నిర్ణయం తీసుకుని గేమ్ ఛేంజర్ ను రామ్ చరణ్ వద్దకు తీసుకు వెళ్లారు అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు జడ్జ్‌మెంట్ విషయంలో తెలుగు ప్రేక్షకులకు చాలా నమ్మకం ఉంది. కనుక గేమ్ ఛేంజర్ హిట్ ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
శంకర్ గత చిత్రం ఇండియన్ 2 తో పాటు ఇతర సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయినా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటానికి కారణం దిల్ రాజు ఈ కథను విని కొన్ని మార్పులు చెప్పడం, కథ బాగా నచ్చడం. ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందుకే చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడు గేమ్ ఛేంజర్ వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి తన నటన విశ్వరూపం చూపించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. తెలుగు తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.