'దిల్ రాజు డ్రీమ్స్' వెనకున్న అసలు కథేంటంటే?
డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఇచ్చిన ఆయన, ఆ తర్వాత సినిమా ప్రొడక్షన్ లోకి దిగి, తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాతగా ఎదిగారు
By: Tupaki Desk | 12 Nov 2024 3:49 AM GMTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఇచ్చిన ఆయన, ఆ తర్వాత సినిమా ప్రొడక్షన్ లోకి దిగి, తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాతగా ఎదిగారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 50కి పైగా చిత్రాలను నిర్మించారు. దానికి అనుబంధంగా 'దిల్ రాజు ప్రొడక్షన్స్' అనే బ్యానర్ ను కూడా స్థాపించారు. అయితే ఇప్పుడు, 'దిల్ రాజు డ్రీమ్స్' పేరుతో ఆయన కొత్త వెబ్ సైట్ ను లాంఛ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఫ్లాట్ ఫామ్ ను తీసుకొస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు.
దిల్ రాజు సోమవారం 'దిల్ రాజు డ్రీమ్స్' లోగోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సంబంధిత వివరాలను పంచుకున్నారు. కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఈ దిల్ రాజు డ్రీమ్స్‌ను ప్రారంభించానని తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఇండస్ట్రీకి రావాలని చాలామంది కలలు కంటుంటారు. తమని తాము ప్రూవ్ చేసుకోడానికి సరైన ఫ్లాట్‌ఫామ్ కోసం చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసమే 'దిల్ రాజు డ్రీమ్స్' ను పడుతున్నట్లుగా దిల్ రాజు తెలిపారు.
దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్‌ను త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ చేస్తామని, స్టార్ హీరోలు, దర్శకులు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంటారని దిల్ రాజు వెల్లడించారు. దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్లు.. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి, మంచి కంటెంట్ ఉంటే దిల్ రాజు టీంను సంప్రదించవచ్చని చెప్పారు. వెబ్ సైట్ ద్వారా కంటెంట్ ను పంపిస్తే, వాటిల్లో తమ టీం బెస్ట్ స్టోరీలను సెలెక్ట్ చేస్తుందని, ఇకపై వారంలో ఒక రోజు తప్పకుండా ఆ కొత్త స్క్రిప్ట్‌లను వినేందుకు సమయం కేటాయిస్తానని తెలిపారు.
తన పుట్టినరోజైన డిసెంబరు 18న గానీ లేదా న్యూ ఇయర్ లో గానీ వెబ్‌సైట్ ప్రారంభిస్తామని దిల్ రాజు అన్నారు. కొత్త వాళ్లందరికీ ఇదొక మంచి ఫ్లాట్ ఫాంగా ఉండాలని అనుకుంటున్నానని, ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు దిల్ రాజు డ్రీమ్స్‌తో కలిసి రెండు ప్రాజెక్టులు చేస్తున్నారని తెలిపారు. రివ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మా స్క్రిప్టులను రివ్యూ చేయొచ్చని, స్క్రిప్ట్ స్టేజ్ లోనే మీడియా వాళ్ల సహాయం తీసుకోవాలని అనుకుంటున్నామన్నారు. సినిమాకి ఎలాగైతే రివ్యూ ఇస్తారో, దాని కంటే ముందు స్క్రిప్ట్‌ని కూడా రివ్యూ చేయటానికి టీంలోకి మీడియాని ఆహ్వానిస్తున్నామని దిల్ రాజు చెప్పారు.
ఏడాదికి నాలుగైదు సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నామని దిల్ రాజు తెలిపారు. కచ్చితంగా రెండు సినిమాలైనా హిట్ అవ్వాలనే కండీషన్ పెట్టుకున్నామని, ఐదు చిత్రాలకు ఐదూ ఫ్లాప్ అయితే తమ కష్టం వృథా అవుతుందన్నారు. అందుకే వడపోసిన వాటిల్లో రెండైనా హిట్ కొట్టగలిగే కథలు ఉండేలా ఎంపిక చేసుకోవాలని టీమ్ కు చెప్పానన్నారు. ఇక్కడ ఎలాంటి రికమండేషన్స్ ఉండవు. ఎవరైనా వెబ్ సైట్స్ ద్వారానే అప్రోచ్ అవ్వాలి. 20 నిమిషాల స్క్రిప్ట్ పోస్ట్ చెయ్యాల్సి ఉంటుంది అని నిర్మాత చెప్పారు.
తమ టాలెంట్ ను నిరూపించుకున్న వారికి శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమాలు చేసే అవకాశం ఉంటుందని దిల్ రాజు తెలిపారు. 'బలగం' వేణుకు తమతో ఎమోషన్ ఏర్పడిందని, అందుకే ఇప్పుడు 'ఎల్లమ్మ' సినిమాను కూడా తనకే చేస్తున్నాడని చెప్పారు. ఈ విధంగా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తే తనకు కూడా హెల్ప్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం తమ బ్యానర్ లో 5 సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయని చెప్పారు.
గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, తమ్ముడు, ఆకాశం దాటి వస్తావా, సెల్ఫిష్ లాంటి సినిమాలు 2025లో వస్తాయని దిల్ రాజు తెలిపారు. 'బలగం' వేణు, నితిన్ కాంబినేషన్ లో 'ఎల్లమ్మ' సినిమా తెరకెక్కుతుందని ధ్రువీకరించారు. వచ్చే ప్రారంభంలో ఈ సినిమాని మొదలుపెట్టి, దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కొలా సినిమా 2026లో వస్తుందని చెప్పారు. ఇవి కాకుండా మరో మూడు స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజీలో ఉన్నాయని దిల్ రాజు చెప్పుకొచ్చారు.