'గేమ్ ఛేంజర్' సంగతేంటి దిల్ రాజు..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతి స్పెషల్ గా థియేటర్లలోకి రాబోతోంది.
By: Tupaki Desk | 26 Dec 2024 12:16 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతి స్పెషల్ గా థియేటర్లలోకి రాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 10వ తారీఖున విడుదల కానుంది. మెగా అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ హైక్స్ ఉండవని ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ జరిగింది. ఈ మీటింగ్ తో అన్నిటిపై ఓ క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ అసలు వాటి గురించి చర్చే జరగలేదని దిల్ రాజు చెబుతున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో తెలంగాణాలో స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇవ్వబోమని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో రాబోయే సంక్రాంతి సినిమాల మీద గట్టి దెబ్బ పడుతుందనే చర్చలు జరిగాయి. ముఖ్యంగా 'గేమ్ ఛేంజర్' ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడుతుందని భావించారు. కాకపోతే ఆ సినిమా నిర్మాత అయిన దిల్ రాజే ప్రస్తుతం ఎఫ్.డి.సి చైర్మన్ గా ఉండటంతో, సమస్య పరిష్కారం అవుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ బెనిఫిట్ షోలు, టికెట్ ధరలపై ఎలాంటి చర్చ లేకుండానే ఈ సమావేశం ముగిసిందని అంటున్నారు.
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ ముగిసిన తర్వాత, బెనిఫిట్ షోలు & టికెట్ రేట్ల విషయంలో అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు సంక్రాంతి సినిమాలు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అనేవి అంత ఇంపార్టెంట్ కాదని.. అది చాలా చిన్న అంశమని మీడియాతో అన్నారు. ఇది మెగా అభిమానులను మరింత గందరగోళానికి గురి చేస్తోంది.
మరో రెండు వారాలలో 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి, బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు అవసరం. అందులోనూ దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ మీద భారీగా ఖర్చు చేశారు. శంకర్ గత చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మేకింగ్ కోసం కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ లేకపోతే పెట్టుబటి వెనక్కి తెచ్చుకోవడం కష్టమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజుకు ఇదంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ, ఫ్యాన్స్ మాత్రం ఈ అంశాన్ని చాలా ఇంపార్టెంట్ గా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలో సమస్యలు, పలు అంశాలపై అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అదనపు షోల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, టికెట్ రేట్ల పెంపుపై నివేదిక రూపొందించడానికి ఈ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎప్పటిలాగే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు వస్తాయనే టాక్ టాలీవుడ్ లో విపిస్తోంది. దిల్ రాజు పైకి చెప్పకపోయినా పెద్ద సినిమాలకు స్పెషల్ బెనిఫిట్స్ లభించే అవకాశం ఉందని అంటున్నారు