CM రేవంత్ రెడ్డి చెవిలో దిల్‌రాజు చెప్పిన మాట!
తనను నమ్మి ముఖ్యమైన బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రికి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.
By: Tupaki Desk | 7 Dec 2024 9:30 PM GMTహైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజు కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
తనను నమ్మి ముఖ్యమైన బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రికి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి కొన్ని అంశాలను చర్చించారని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్ రాజును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా ఉన్నారు. ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా దిల్ రాజు నియామకం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారికంగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా వెల్లడైన సంగతి తెలిసిందే.
2003లో బ్లాక్‌బస్టర్ చిత్రం 'దిల్'తో నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న తర్వాత 'దిల్ రాజు' అనే పేరును సంపాదించుకున్నారు. టాలీవుడ్ అగ్ర హీరోలందరితో సినిమాలు తీసిన దిల్ రాజు పంపిణీ, ఎగ్జిబిషన్ రంగాల్లోను తనదైన ముద్ర వేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లోను ఆయన నిర్మాతా అడుగు పెట్టారు. వరుసగా హిందీ చిత్రాలను నిర్మిస్తున్నారు. మరోవైపు శంకర్ తో గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పరిశ్రమలో తన ప్రభావాన్ని మరింత పటిష్టం చేస్తూ వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు.