Begin typing your search above and press return to search.

శంక‌ర్ త‌ర్వాత దిల్ రాజు టార్గెట్ అత‌డే

తెలుగు చిత్ర‌సీమ గౌర‌వాన్ని పెంచ‌డంలో మ‌న ఫిలింమేక‌ర్స్ ప‌నిత‌నాన్ని ప్ర‌పంచం కొనియాడుతోంది.

By:  Tupaki Desk   |   17 Dec 2024 7:00 AM GMT
శంక‌ర్ త‌ర్వాత దిల్ రాజు టార్గెట్ అత‌డే
X

తెలుగు చిత్ర‌సీమ గౌర‌వాన్ని పెంచ‌డంలో మ‌న ఫిలింమేక‌ర్స్ ప‌నిత‌నాన్ని ప్ర‌పంచం కొనియాడుతోంది. ముఖ్యంగా హిందీ చిత్ర‌సీమ ప్ర‌ముఖులంతా ద‌క్షిణాది ప్ర‌తిభ‌కు దాసోహం అంటున్నారు. రాజ‌మౌళి, సుకుమార్, కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌, చందు మొండేటి (కార్తికేయ 2) లాంటి ద‌ర్శ‌కులు ఇప్ప‌టికే పాన్ ఇండియా సినిమాల‌తో స‌త్తా చాటారు. మునుముందు పాన్ ఇండియాలో వెలిగిపోయే తెలుగు ద‌ర్శ‌కులు మ‌రింత మంది వెలుగులోకి వ‌స్తార‌ని అంచ‌నా.

ఇలాంటి సమ‌యంలో నిర్మాత‌ల నుంచి కూడా ప‌రిశ్ర‌మ గౌర‌వాన్ని పెంచే స‌త్తా ఉన్న‌వారి గురించి ప్ర‌స్థావించాలి. తెలుగు చిత్ర‌సీమ‌లో నిర్మాత‌గా, పంపిణీదారుగా, ఎగ్జిబిట‌ర్ గా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న దిల్ రాజు కొంత‌కాలంగా సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో అత్యంత భారీ బ‌డ్జెట్ సినిమాని నిర్మిస్తూ ఇటీవ‌ల చ‌ర్చ‌ల్లో నిలిచారు. చ‌ర‌ణ్‌-శంక‌ర్ క‌ల‌యిక‌లో దిల్ రాజు నిర్మిస్తున్న `గేమ్ ఛేంజ‌ర్` 2024-25 మోస్ట్ అవైటెడ్ సినిమాగా థియేట‌ర్ల‌లోకి రానుంది.

ఇలాంటి స‌మ‌యంలో దిల్ రాజు నుంచి మ‌రో క్రేజీ అప్ డేట్ అంద‌నుంద‌ని స‌మాచారం. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో ఆయ‌న భారీ ప్రాజెక్టును ప్ర‌క‌టించే ఛాన్సుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. రాజు గారి ఆస్థాన ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఇప్ప‌టికే ప‌లుమార్లు అమీర్ ఖాన్ ని క‌లిసి కథా చ‌ర్చ‌లు సాగించార‌ని, ప్ర‌తిదీ ఓకే అయ్యాక దీనిని అధికారికంగా ప్ర‌క‌టించే వీలుంద‌ని టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు, పైడిప‌ల్లి అమీర్ ఖాన్ తో నిరంత‌రం ట‌చ్ లోనే ఉన్నారు. కొత్త సంవ‌త్స‌రంలో శుభ‌వార్త‌ను చెబుతారు. భారీ ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుడ‌తార‌ని తెలుస్తోంది. దిల్ రాజు మునుముందు భారీ ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకెళ్ల‌నున్నారు. శంక‌ర్ తో సినిమా కోసం సుమారు 350కోట్లు పైగా బ‌డ్జెట్ ఖ‌ర్చు చేస్తున్నార‌ని ప్ర‌చారం ఉంది. అమీర్ ఖాన్ తో ప్రాజెక్ట్ అంటే ఇంచుమించు ఆ రేంజులో ఉంటుంది. అక్షయ్ కుమార్, షాహిద్ క‌పూర్, ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్య‌న్ లాంటి ప్ర‌తిభావంత‌మైన ఛ‌రిష్మా ఉన్న స్టార్ల‌తోను సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌తిదీ దిల్ రాజు కాంపౌండ్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

సీక్వెల్ తో హిట్టొస్తుందా?

మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన `లాల్ సింగ్ చ‌డ్డా` డిజాస్ట‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నాగ‌చైత‌న్య‌కు ఊహించ‌ని ఫ‌లితం ఎదురైంది. ప్ర‌స్తుతం బ్లాక్ బ‌స్ట‌ర్ క‌ల్ట్ మూవీ `తారే జ‌మీన్ ప‌ర్` సీక్వెల్ `సితారే జ‌మీన్ ప‌ర్` కోసం అమీర్ చాలా శ్ర‌మిస్తున్నారు. మొద‌టి భాగంలో అమీర్ ఖాన్ పాత్ర అన్నివ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంది. సీక్వెల్ లో అత‌డి పాత్ర ఏమిట‌న్న‌ది వేచి చూడాలి. ఈ సీక్వెల్ త‌న‌కు బిగ్ కంబ్యాక్ ఇస్తుంద‌ని ఖాన్ ఆశిస్తున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో తెలుగు ప్ర‌తిభ‌ను న‌మ్ముకుని త‌దుప‌రి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు.