సంక్రాంతితో రిస్కీ రీమేక్..?
దిల్ రాజు టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్‌గానే కాకుండా బాలీవుడ్‌లో కూడా తన లక్ పరీక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 21 Feb 2025 6:26 AM GMTదిల్ రాజు టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్‌గానే కాకుండా బాలీవుడ్‌లో కూడా తన లక్ పరీక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఆ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. గతంలో నాని ‘జెర్సీ’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే, ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ అదే బాటలో, తన లేటెస్ట్ హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఇది కాస్త రిస్కీ గేమ్ అనే చెప్పాలి.
సంక్రాంతి సందర్భంగా వేంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా బిగ్ హిట్‌గా నిలిచింది. అందులోనూ, గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌తో 100 కోట్ల నష్టం చూసిన దిల్ రాజుకి, ఈ హిట్ నిజంగా కాస్త ఊరట ఇచ్చింది. సినిమా సక్సెస్ లో ప్రధానం కారకుడు అనిల్. కంటెంట్ విషయంలోనే కాకుండా ప్రమోషన్ విషయంలో కూడా అతను చూపిన శ్రద్ధ సినిమాకు మంచి బజ్ తీసుకు వచ్చాయి.
అయితే ఈ సినిమా కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని భావించి, బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు దిల్ రాజు స్కెచ్ వేశారని తెలుస్తోంది. అయితే, ఆ కాంబోలో అనిల్ రావిపూడి లేకపోవడం, పెద్ద ప్రశ్నగా మారింది. అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నందున, ఈ రీమేక్‌కు దర్శకత్వ బాధ్యతలు వేరే వ్యక్తి తీసుకోనున్నారని టాక్.
దిల్ రాజు ఇప్పటికే ఓ ఇద్దరు దర్శకులతో చర్చలు మొదలు పెట్టారట. అయితే, ఇంకా ఎవరు ఫైనల్ అయ్యారనే క్లారిటీ లేదు. దర్శకుడు కుదిరిన వెంటనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ను కాస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే అక్షయ్‌కి దిల్ రాజు ఎప్పుడో ఒక అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ డీల్ లో భాగంగా రీమేక్ ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
అయితే అక్షయ్ ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప అతని స్టార్ ఇమేజ్ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పించడం లేదు ఇటీవల ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. సినిమాలు వసూళ్లు కూడా తక్కువగానే ఉన్నాయి. కానీ, అతని కామెడీ టైమింగ్ బాలీవుడ్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. హౌస్ ఫుల్ ఫ్రాంచైజ్ లాంటి సినిమాలతో మంచి హిట్స్ ఉన్నాయి.
పైగా గత కొంత కాలంగా అక్షయ్ నుంచి మంచి కామెడీ సినిమాలు రాలేవు. ఈ కోణంలో చూస్తే, సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ అక్షయ్‌కి సరిగ్గా సరిపోతుందనేది దిల్ రాజు ప్లాన్. అయితే తెలుగు నిర్మాతలు హిందీలో విజయం సాధించడం అంత సులువు కాదు. తక్కువ సినిమాలతోనే బాలీవుడ్‌లో హిట్ కొట్టిన వాళ్లు అరుదు. పైగా, హిట్ కాంబోలో దర్శకుడు లేకుండా సినిమా తీయడం నిజంగానే పెద్ద రిస్క్. ఒకవేళ కథలో తేడా వచ్చినా, స్క్రీన్‌ప్లే బాలీవుడ్ ఆడియన్స్‌కు అనుకూలంగా మలచకపోతే, ఈ ప్రాజెక్ట్ కూడా ‘జెర్సీ’ లాగే డిజాస్టర్ అవ్వొచ్చు. మొత్తానికి, దిల్ రాజు ఇప్పుడు ఎంచుకున్న రీమేక్ గేమ్ పుల్ రిస్క్‌లో ఉంది. మరి రాజుగారి ప్లాన్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.