ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజు..!
స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. దీనిపై దిల్ రాజు స్పందించారు.
By: Tupaki Desk | 22 Jan 2025 11:35 AM GMTటాలీవుడ్ సినీ ప్రముఖులపై ఐటీ రైడ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని పలువురు సినీ నిర్మాతల నివాసాలు, ఆఫీసులపై ఆదాయ పన్నుశాఖ అధికారులు గత రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. దీనిపై దిల్ రాజు స్పందించారు.
బుధవారం తన నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో, దిల్ రాజు ఇంటి నుంచి బయటకు వచ్చి బాల్కనీలో నిలబడ్డారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియా మిత్రులు 'సోదాలు ఎంతసేపు జరిగే అవకాశం ఉంది?' అని ప్రశ్నించగా.. ''మన చేతిలో ఏముంటది. వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు. సరదాగా ఇక్కడ కూర్చున్నాను'' అని దిల్ రాజు బదులిచ్చారు. ఐటీ దాడులు తన ఒక్కడిపైనే జరగడం లేదని, ఇండస్ట్రీ మొత్తం మీద సోదాలు జరుగుతున్నాయని దిల్ రాజు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సంక్రాంతికి విడుదలైన తర్వాత ఆయనపై ఇన్కమ్ టాక్స్ రైడ్స్ జరగడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే దిల్ రాజు ఇళ్లు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు డ్యాక్యుమెంట్స్ ను పరిశీలిస్తున్నారు. సినిమాలకు ఎంత ఖర్చు పెట్టారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఐటీ చెల్లింపులు చేసారా లేదా? వంటి అంశాలపై ఆరాలు తీస్తున్నట్లు తెలుస్తోంది.
దిల్ రాజుతో పాటుగా ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్సితా రెడ్డి నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. అలానే దిల్ రాజు వ్యాపార భాగస్వామి అయిన మ్యాంగో మీడియా రామ్ ఇళ్ళు, ఆఫీస్ లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు వ్యక్తిగత బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను నిశితంగా పరిశీలించారు. దిల్ రాజు భార్యను తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించి, ఆస్తుల వివరాలు పరిశీలించారు. ఈక్రమంలో రెండో రోజు కూడా దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలపైనా ఆదాయ పన్నుశాఖ అధికారులు రైడ్స్ చేసారు. మొత్తం 55 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయని తెలుస్తోంది. ప్రాథమిక ఆధారాలతోనే సోదాలు నిర్వహిస్తున్నారట. నిర్మాతల ఆదాయం, ట్యాక్స్ చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారట. బ్యాంకు లాకర్లను తనిఖీ చేయడంతో పాటుగా, ప్రొడక్షన్ హౌస్ లకు చెందిన వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్స్ ను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.