ఐటీ కార్యాలయానికి దిల్ రాజు.. కారణమిదే!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఇటీవల ఆదాయ పన్ను అధికారులు విస్తృతంగా సోదాలు జరిపిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 4 Feb 2025 5:09 AM GMTటాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఇటీవల ఆదాయ పన్ను అధికారులు విస్తృతంగా సోదాలు జరిపిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు.. వ్యాపారాలకు సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వాలని దిల్ రాజుకు నోటీసులు ఇచ్చినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో నేడు ఉదయం దిల్ రాజు.. ఐటీ కార్యాలయానికి వెళ్లారు. డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఐటీ అధికారులకు ఆయన అందించినట్లు తెలుస్తోంది. అయితే ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి దిల్ రాజు వెళ్లిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫుల్ వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్ రాజు రెండు సినిమాలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రొడక్షన్ తో పాటు వసూళ్లు, లాభాల వ్యవహారాలపై ఐటీ అధికారులు.. దిల్ రాజును ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజుతో పాటు పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి.
అదే సమయంలో ఐటీ సోదాల విషయంపై ఇప్పటికే దిల్ రాజు పలుమార్లు స్పందించారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత తమ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయని దిల్ రాజు తెలిపారు. ఆ విషయంపై అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఉన్నారని, తెలిసి తెలియని విషయాలతో దీనిని బాగా హైలైట్ చేస్తున్నారని విమర్శించారు.
బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న వారిపై దాడులు జరగడం ఎప్పుడూ కామనేనని అన్నారు. తన ఇల్లు, కార్యాలయంలో ఇంత డబ్బు దొరికింది, ఏవేవో డాక్యుమెంట్లు దొరికాయని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తమ దగ్గర అలాంటిది ఏమీ జరగలేదని, ఎలాంటి అనధికారిక డాక్యుమెంట్లు, డబ్బులు లేవని స్పష్టం చేశారు.
అదే సమయంలో ఐటీ సోదాలు తన ఒక్కడి పైనే జరగడం లేదని అన్నారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలు ఐటీ అధికారులు పరిశీలించారని చెప్పారు. తాజాగా ఆయన ఐటీ కార్యాలయానికి వెళ్లారు. అధికారులకు వివిధ డాక్యుమెంట్లు, స్టేట్మెంట్లు అందించారు!