దిల్ రాజు బ్యాంక్ లాకర్లు ఓపెన్.. ఆయన సతీమణి ఏమన్నారంటే..
తాజాగా, దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంక్ లాకర్లను ఐటీ అధికారుల ముందు ఓపెన్ చేయడం సంచలనం రేపింది.
By: Tupaki Desk | 21 Jan 2025 9:19 AM GMTటాలీవుడ్‌లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు నిర్వహిస్తున్న సోదాలు సినీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లతో పాటు, పాన్ ఇండియా సినిమాల ఫైనాన్సర్‌ల వరకు ఈ దాడులు విస్తరించాయి. భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించి పన్నుల చెల్లింపుల అనుమానాలపై ఈ దాడులు కొనసాగుతున్నాయి.
తాజాగా, దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంక్ లాకర్లను ఐటీ అధికారుల ముందు ఓపెన్ చేయడం సంచలనం రేపింది. ఈ సందర్భంగా తేజస్విని మీడియాతో మాట్లాడుతూ, ‘‘రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఐటీ అధికారులు వచ్చారు. వారు అడిగిన వివరాల ప్రకారం బ్యాంక్ లాకర్లను చూపించాం,’’ అని స్పష్టం చేశారు. ఈ వివరణతో దిల్ రాజు కుటుంబం సైలెంట్ గానే కనిపిస్తున్నా, సినీ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో, ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా సినిమా దేవర ఫైనాన్సర్ సత్య రంగయ్య ఇంట్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. పాన్ ఇండియా సినిమాలకు భారీ బడ్జెట్‌లు ఎలా వస్తున్నాయి? పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారా? ఫైనాన్షియర్లకు చెల్లింపులు ఎలా జరుగుతున్నాయి? వంటి అంశాలపై వారు సోదాలు కొనసాగిస్తున్నారు.
దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, దేవర ఫైనాన్షియర్ ఇళ్లలో సోదాలు జరగడం వల్ల సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేగింది. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ హిట్ల నిర్మాణ సంస్థలపై ఐటీ దాడులు జరగడం, వీటిలో నమోదైన భారీ వసూళ్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సోదాలు నిర్మాతల పన్ను చెల్లింపులు, ఫైనాన్షియర్లకు జరిగిన చెల్లింపులపై ఫోకస్ పడేలా చేస్తాయా? లేదా అన్నది ఆసక్తిగా మారింది.
ఐటీ సోదాలు సినీ వర్గాల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రత్యేకంగా పాన్ ఇండియా చిత్రాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్ నిర్వహణపై అధికారులు సోదాలు నిర్వహించడం పరిశ్రమలో పన్ను కట్టే విధానాలపై ప్రశ్నలు తలెత్తేలా చేసింది. ఈ దాడులు సినీ పరిశ్రమలో పారదర్శకతను పెంపొందిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సోదాల తరువాత టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంశాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని సినీ పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ఐటీ దాడులు ఇంకా ఎంతవరకు వెళతాయో చూడాలి.