తెలంగాణ ప్రభుత్వ నోటీసుకు గాయకుడి స్పందన
ప్రముఖ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ తాజా మ్యూజిక్ కాన్సర్ట్ సంచలనాలు సృష్టిస్తోంది.
By: Tupaki Desk | 18 Nov 2024 4:17 AM GMTప్రముఖ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ తాజా మ్యూజిక్ కాన్సర్ట్ సంచలనాలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా దిల్-లుమినాటి పర్యటన సందర్భంగా అతడు ముంబై, కోల్‌కతా, ఇండోర్, పూణె, గౌహతి సహా పది నగరాలలో అతడు షోలతో అలరిస్తున్నాడు. దిల్లీలో అద్భుత ప్రదర్శన (కాన్సర్ట్) కు గొప్ప స్పందన వచ్చింది. జైపూర్ తర్వాత దిల్లీ సంగీత కచేరీకి ఒకే రోజున వేలాది మంది హాజరయ్యారు.
ఆసక్తికరంగా హైదరాబాద్ షో విషయంలో కొన్ని ఆంక్షలు ఆశ్చర్యపరిచాయి. పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ తన హైదరాబాద్ సంగీత కచేరీలో మద్యం, మాదక ద్రవ్యాలు లేదా హింసను ప్రోత్సహించే పాటలను ప్రదర్శించకుండా హెచ్చరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన లీగల్ నోటీసు గురించి సరదాగా ప్రస్థావించారు. అయితే అంతర్జాతీయ కళాకారులు భారతీయ ప్రదర్శనకారుల కంటే తక్కువ పరిమితులను ఎందుకు ఎదుర్కొంటున్నారని దిల్జీత్ దోసాంజ్ ప్రశ్నించారు. ఇటీవలి ప్రదర్శనలో అతడు పాటలను కొంత హ్యూమర్ టచ్ లోకి మార్చాడు. తన పరిస్థితికి తెలివిగా రియాక్టయ్యాడు.
మద్యం, హింసపై పాటలు పాడకుండా తెలంగాణ ప్రభుత్వం తనను ఆపడంపై పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ స్పందించారు. సంగీత కచేరీలో ప్రభుత్వ హెచ్చరికపై గాయకుడు దిల్జీత్ వ్యాఖ్యానిస్తూ ``ఇతర దేశాల నుండి కళాకారులు ఇక్కడికి వచ్చినప్పుడు, వారు కోరుకున్నది చేయడానికి అనుమతిస్తారు... కానీ స్వదేశానికి చెందిన ఒక కళాకారుడు పాడుతున్నప్పుడు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి`` అని దిల్జిత్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో జరగబోయే కచేరీలో మద్యం, మాదక ద్రవ్యాలు లేదా హింసను ప్రోత్సహించే పాటలను ప్రదర్శించవద్దని నోటీసులో అతడిని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. అహ్మదాబాద్(గుజరాత్)లో తన సంగీత కచేరీ సందర్భంగా దిల్జిత్ దోసాంజ్ తన ప్రదర్శనలకు సంబంధించిన న్యాయపరమైన చిక్కుల గురించి ప్రస్తావించారు. ఆ రోజు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని అయితే గుజరాత్ చట్టాలను గౌరవిస్తూ ప్రదర్శన సమయంలో మద్యానికి సంబంధించిన పాటలు పాడటం మానేస్తున్నానని తన ప్రేక్షకులకు హామీ ఇచ్చాడు.
బాలీవుడ్‌లో ఆల్కహాల్ గురించి చాలా పాటలు ఉన్నాయి. కానీ నేను పాడిన వాటిలో అరుదుగా ఉంటాయని అన్నాడు. బాలీవుడ్ తారల్లా తాను మద్యాన్ని ఆమోదించడం లేదా ప్రచారం చేయనని అన్నాడు. తెలంగాణ ప్రభుత్వ నోటీసు అందుకున్న తర్వాత తన లిరిక్ లలో మత్తు గురించిన పదాలను, సాహిత్యాన్ని సవరించినట్టు అతడు తెలిపాడు.