తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు.. దిల్ రాజు ఏమన్నారంటే?
దీంతో సంక్రాంతి సినిమాలకు ఏపీలో అనుమతులు వచ్చాయి కానీ తెలంగాణలో రాలేదు.
By: Tupaki Desk | 6 Jan 2025 10:34 AM GMTతెలంగాణ ఇకపై కొత్త సినిమాలకు టికెట్ రేట్లు పెంచేందుకు, ప్రీమియర్ షోస్ వేసేందుకు పర్మిషన్ ఇవ్వమని రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టాలీవుడ్ పెద్దలతో జరిగిన సమావేశంలో కూడా అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సంక్రాంతి సినిమాలకు ఏపీలో అనుమతులు వచ్చాయి కానీ తెలంగాణలో రాలేదు. ఇప్పుడు ఆ విషయంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు.
"అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి టికెట్ రేట్లు పెంచమని చెప్పారు.. మరోసారి ఆయన వద్దకు మీరు ప్రతిపాదన తీసుకెళ్తా అంటున్నారు.. దాన్ని ఎలా చూడాలి" అన్న ప్రశ్నకు దిల్ రాజు తాను ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రెస్పాండ్ అయ్యారు. "మీరు ముఖ్యమంత్రి స్పీచ్ చూస్తే తెలుస్తుంది.. ఆయన సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదని చెప్పారు" అని దిల్ రాజు తెలిపారు.
"అన్నీ ఇస్తాం.. కానీ అలాంటి (సంధ్య థియేటర్ ఘటన) ఇన్సిడెంట్లు జరగకూడదని అన్నారు.. జరిగింది కాబట్టి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. అన్నీ ఇస్తానని చెప్పారు. ఆ ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ వినండి. ఆకలైతే అడగందే అమ్మ కూడా పెట్టదుగా.. అందుకు నేను కూడా కోపరేట్ చేయమని అడుగుతా" అని పేర్కొన్నారు.
ఒక నిర్మాతగా త్వరలోనే ఆయన్ను కలిసి టికెట్ రేట్ల గురించి మాట్లాడతానని, కానీ తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎలాంటి సమాధానం వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఏదేమైనా సినిమా పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి తమకు చెప్పినట్లు గుర్తుచేశారు దిల్ రాజు.
అయితే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని సూచించినట్లు చెప్పారు. ఫార్మా, ఐటీ, సినిమా రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని ఆయన ఇటీవల తమతో అన్నట్లు తెలిపారు. తాను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టినందుకు ఎంతో హ్యాపీగా ఉందని దిల్ రాజు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంయుక్తంగా వర్క్ చేస్తానని చెప్పారు. మూవీ ఇండస్ట్రీకి.. ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటానని పేర్కొన్నారు. అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. తాను గేమ్ ఛేంజర్ తో తప్పకుండా కమ్‌బ్యాక్ ఇస్తానని అనుకుంటున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. తమ బ్యానర్ పై రూపొందిన మరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం విషయంలో నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.