భారమంతా చరణ్ మీదే..
టాలీవుడ్ లో జడ్జిమెంట్ కింగ్‌గా పేరున్న నిర్మాత దిల్ రాజు. స్క్రిప్టు దశలోనే ఆయన సినిమా ఫలితాన్ని అంచనా వేయగలడని అంటారు
By: Tupaki Desk | 8 April 2024 5:18 AM GMTటాలీవుడ్ లో జడ్జిమెంట్ కింగ్‌గా పేరున్న నిర్మాత దిల్ రాజు. స్క్రిప్టు దశలోనే ఆయన సినిమా ఫలితాన్ని అంచనా వేయగలడని అంటారు. అందుకే 20 ఏళ్లకు పైగా మంచి సక్సెస్ రేట్‌తో కొనసాగుతూ పెద్ద రేంజికి వెళ్లారు. కానీ ఈ మధ్య రాజు జడ్జిమెంట్ తేడా కొడుతోంది. ప్రొడ్యూసర్‌గా ఆయన తరచుగా వైఫల్యాలు ఎదుర్కొంటున్నారు. గత రెండేళ్లలో థ్యాంక్యూ, శాకుంతలం.. లేటెస్ట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’ ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఎంత పెద్ద నిర్మాత అయినా వరుస ఫెయిల్యూర్లు వస్తే తట్టుకుని నిలబడడం కష్టం. రాజు కూడా అందుకు మినహాయింపు కాదు. ‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్న విషయం లేటెస్ట్‌గా మీడియాతో మాట్లాడిన సందర్భంగా అర్థమైపోయింది. రెండో రోజు వసూళ్లు బాగా డ్రాప్ అయిపోవడం రాజును షేక్ చేసినట్లు కనిపిస్తోంది.
నిర్మాతగా రాజుకు వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో ఆయనకు ఒక భారీ విజయం అవసరం. దీంతో ఆయన ఆశలన్నీ ఇక ‘గేమ్ చేంజర్’ మీదే నిలవనున్నాయి. రాజు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా ఇది. రామ్ చరణ్-శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోందీ సినిమా. ఐతే చిత్రీకరణ బాగా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ హద్దులు దాటేసింది. ముందు అనుకున్న బడ్జెట్ కంటే 40-50 శాతం అదనంగా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. అసలే రాజుకు చాన్నాళ్లుగా సరైన సక్సెస్ లేదు. పైగా బడ్జెట్ బాగా ఎక్కువైపోయింది. ఈ పరిస్థితుల్లో ‘గేమ్ చేంజర్’ పెద్ద హిట్ అయి తీరాల్సిందే. ఇది ఏమాత్రం అటు ఇటు అయినా రాజుకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఆ ప్రభావం గట్టిగా పడుతుంది. కాబట్టి ఈ భారాన్ని రామ్ చరణ్ ఎలా మోస్తాడో.. ఈ సినిమాతో రాజుకు ఎలాంటి ఫలితాన్నందిస్తాడో చూడాలి.