ఎవరినీ బలవంతం చేయలేదు: దిల్ రాజు
రేసు నుండి కనీసం ఓ రెండు సినిమాలు వైదొలిగితే థియేటర్ల సమస్య తప్పుతుందని భావించినట్టు కథనాలొచ్చాయి.
By: Tupaki Desk | 26 Dec 2023 4:08 AM GMT2024 సంక్రాంతి బరిలో అరడజను పైగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పందెంపుంజులు నువ్వా నేనా అంటూ తలపడబోతున్నాయి. మహేష్, వెంకటేష్, నాగార్జున, రవితేజ లాంటి అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతుండడంతో ఇప్పటికే అభిమానుల్లో సందడి నెలకొంది. గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్, ఈగిల్, హనుమ్యాన్.. ఇవన్నీ సంక్రాంతి సెలవులను ఎన్ క్యాష్ చేయాలని వస్తున్నాయి.
అయితే పండగ సీజన్‌లో థియేటర్ల సమస్యపై చర్చ మొదలైంది. సంక్రాంతి బరిలో ఉన్న నిర్మాతలంతా ఫిలిం ఛాంబర్‌లో సమావేశమై సమస్య పరిష్కారం కోసం చర్చించారని ప్రచారమైంది. రేసు నుండి కనీసం ఓ రెండు సినిమాలు వైదొలిగితే థియేటర్ల సమస్య తప్పుతుందని భావించినట్టు కథనాలొచ్చాయి. అన్ని సినిమాలకు సరిపడా థియేటర్లు రావాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రయత్నం. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమ్యాన్ వాయిదాపై ఒత్తిడి చేసారని కూడా ప్రచారం సాగింది.
అయితే ఇది నిజమేనా? అన్నదానికి దిల్ రాజు స్వయంగా సమాధానమిచ్చారు. సంక్రాంతి రేసులో పెద్ద సినిమాల్ని పంపిణీ చేస్తున్న ఆయన ..తమపై కొనసాగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. అరడజను సినిమాల పోటీ ఘర్షణగా మారుతుందని చర్చించాం. రేసు నుంచి తప్పుకోవాలని మేం ప్రత్యేకంగా ఏ నిర్మాతను అడగలేదు. అన్నీ ఒకే పండుగ సీజన్‌లో విడుదల కావాలంటే థియేటర్ల కొరత తప్పదు. ఒకట్రెండు సినిమాలు వెనక్కు తగ్గితే, జనవరి లేదా ఫిబ్రవరిలో ఫిలిం ఛాంబర్ సోలో విడుదల తేదీని నిర్ధారిస్తుంది" అని అగ్రనిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించారు.
"సంక్రాంతికి వచ్చే నిర్మాతలందరితో మాట్లాడాం... ఎవరైనా తగ్గితే వాళ్ళకి సోలో రిలీజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మాట్లాడా. నా సలహా ఇచ్చాను" అన్నారు. కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారి అప్పోయింట్మెంట్ అడిగాం, త్వరలో కలిసి సినిమా పరిశ్రమ గురించి చర్చించాలి అనుకుంటున్నామని కూడా దిల్ రాజు వెల్లడించారు.