సినిమా ప్రమోషన్లలో కొత్త ట్రెండ్: హైప్ కోసం హద్దులు దాటుతున్నారా?
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
By: Tupaki Desk | 12 March 2025 2:12 PM ISTఇప్పుడున్న సినిమాల మార్కెటింగ్ స్ట్రాటజీలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం ట్రైలర్, సాంగ్స్, ఇంటర్వ్యూలతో సినిమాను ప్రమోట్ చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ సినిమా కోసం ఏదైనా స్టేట్‌మెంట్ ఇవ్వడంలో వెనుకాడడం లేదు. ముఖ్యంగా, ఫస్ట్ డే ఓపెనింగ్స్ చాలా ముఖ్యమైన వేళ, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేలా తమ మాటలను వినిపిస్తున్నారు.
సినిమా నచ్చకపోతే టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇస్తాం- ఒక్క తప్పు వెతికినా పార్టీ ఇస్తాం - సినిమా ఎంటర్టైన్ చేయకుంటే నాకు ఫోన్ చేయండి.. ఇదే నా నెంబర్ అంటూ.. స్టేట్మెంట్స్ ఇవ్వడం మొన్నటి వరకు హైలెట్ అయ్యింది. కానీ ఇప్పుడు మరో లెవెల్ కు వెళ్లి సినిమా నచ్చకుంటే నన్ను కొట్టండి అనే వరకు వచ్చారు. ఇదే విషయాన్ని తాజా ఉదాహరణగా నిలిపిన వ్యక్తి ‘దిల్ రుబా’ నిర్మాత రవి.
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. "మా సినిమాలో కిరణ్ అబ్బవరం చేసే ఫైట్లు నచ్చకపోతే నన్ను మధ్యాహ్నం చితక్కొట్టేయండి" అనే స్థాయికి వెళ్లారు. అంతేకాదు, "ఈ సినిమా ఫెయిల్ అయితే ఇక ప్రొడ్యూసర్‌గా ఉండను" అనే మరో సంచలన వ్యాఖ్యానంతో ఊహించని విధంగా హైప్ క్రియేట్ చేశారు. సినిమా మీద తనకు ఎంతో నమ్మకం ఉందని చెప్పడమా లేక ప్రజల్లో హైప్ పెంచేందుకు కావాలనే ఇలా మాట్లాడతారా అనే ప్రశ్నలు ప్రేక్షకులలో తలెత్తుతున్నాయి.
ఇది సినిమా మీద కాన్ఫిడెన్స్ అయితే తప్పులేదు. కానీ, ఇలాంటి ప్రమోషన్ వాఖ్యల వెనుక ఉన్న నిజం ఏమిటో గుర్తించాలి. గతంలో ఇదే తరహాలో ఓ యంగ్ హీరో తన సినిమా హిట్ కాకపోతే పేరు మార్చుకుంటానని శపథం చేశాడు. కానీ, సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న తర్వాత దాని గురించి ఎక్కడా మళ్లీ మాట్లాడలేదు. ఇక ఇప్పుడు దిల్ రుబా నిర్మాత రవి స్టేట్‌మెంట్ నిజమేనా? లేక ఇది కేవలం ఓపెనింగ్స్ పెంచే స్ట్రాటజీనా? అనే విషయం రేపటితో స్పష్టమవుతుంది.
సినిమాకు ఓపెనింగ్స్ లోనే నిర్మాతలకు భారీగా డీల్ అవుతుంది. కానీ, సినిమాకు కంటెంట్ ఉన్నప్పుడు, అది సహజంగానే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఓవర్ హైప్ చేసి, ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయిన సినిమాల సంఖ్య పెరుగుతోంది. ‘దిల్ రుబా’ నిర్మాత మాట్లాడుతూ, హై రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని హైప్ క్రియేట్ చేయడం ఆశ్చర్యమే. ఎందుకంటే, సినిమా కథ ప్రధానంగా ఓ బ్రేకప్ నుంచి బయల్దేరిన కొత్త లవ్ స్టోరీగా ఉంటుందని ముందుగా చెప్పబడింది.
ఇప్పటి ట్రెండ్‌లో హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ప్రమోషన్‌లో భాగస్వామ్యం అవుతున్నారు. సంగీత దర్శకుడు సామ్ సిఎస్ ఈవెంట్‌కు రాకపోయినా, కిరణ్ అబ్బవరం పబ్లిక్‌గా ముద్దులు ఆఫర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ఒకప్పుడు సినిమాపై నమ్మకంతో ప్రమోషన్ చేయడం ఒక విషయం. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి ఏవైనా వాగ్దానాలు చేయడమనేది టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. మరి ‘దిల్ రుబా’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.