‘హిట్-3’ దర్శకుడి ఆవేదన సబబే కదా
ఇంకా రిలీజ్ కూడా కాని సినిమా కూడా పైరసీ అయిపోయి ఆన్ లైన్లోకి వచ్చేస్తున్న రోజులివి.
By: Tupaki Desk | 4 April 2025 9:47 AMఇంకా రిలీజ్ కూడా కాని సినిమా కూడా పైరసీ అయిపోయి ఆన్ లైన్లోకి వచ్చేస్తున్న రోజులివి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండడంతో సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కంటెంట్ ఎలాగోలా బయటికి వచ్చేస్తోంది. ప్రేక్షకుల కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసినా.. అది థియేటర్లో బొమ్మ పడే వరకు ఆగట్లేదు. ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలోకి సమాచారం వచ్చేస్తోంది.
ఆ మధ్య నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడానికి ముందే లీక్ అయిపోవడం పట్ల దాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంత తీవ్రంగా స్పందించాడో తెలిసిందే. ఇప్పుడు నాని మరో సినిమా ‘హిట్-3’ దర్శకుడి వంతు వచ్చింది. ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న శైలేష్ కొలను.. సినిమా కోసం ప్లాన్ చేసిన సర్ప్రైజ్ లీక్ అయిపోవడంతో తీవ్ర ఆవేదనతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
‘హిట్-3’లో తమిళ నటుడు కార్తి క్యామియో చేస్తున్న విషయంలో సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. కొన్ని హ్యాండిల్స్ అత్యుత్సాహంతో విషయాన్ని బయటపెట్టేశాయి. ఐతే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి ఉద్దేశించిన విషయాన్ని ఇలా జర్నలిస్టులు లీక్ చేసేయడం పట్ల శైలేష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. సినిమాకు పని చేసేవాళ్లు రేయింబవళ్లు శ్రమిస్తారని.. ప్రేక్షకులకు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ఇదంతా అని.. అలాంటిది ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా జర్నలిస్టులు ఇలా లీక్ చేయడం ఎంత వరకు సమంజసం అని అతను ప్రశ్నించాడు.
ఇలాంటి రిపోర్టింగ్ తమ కష్టాన్ని దోచుకోవడమే కాదు, ప్రేక్షకులనూ దోచుకోవడమే అని అతను పేర్కొన్నాడు. శైలేష్ ఆవేదనలో న్యాయం ఉందని.. రిలీజయ్యాక హైలైట్ అయ్యే, ప్రేక్షకులను థ్రిల్ చేసే విషయాలను ఇలా లీక్ చేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతూ శైలేష్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.