అమ్మకు గుండెపోటు వస్తుందని నిజం దాచాము.. ప్రముఖ దర్శకుడు!
ఆయన మాట్లాడుతూ.. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. నేను సినిమా నుండి నిష్క్రమించవలసి వచ్చినప్పుడు ఆమెకు తెలిస్తే గుండెపోటు వస్తుందని భయపడిపోయాను.
By: Tupaki Desk | 3 Jan 2025 3:55 AM GMTమీటూ ఉద్యమ సమయంలో తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నాడు బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్. పలువురు నటీమణులు సాజిద్ తమను వేధించాడని ఆరోపించడంతో అతడిపై విచారణ కొనసాగింది. అతడు అప్పటికే సెట్స్ పై ఉన్న హౌస్ ఫుల్ 4 నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆరేళ్లలో చాలాసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని సాజిద్ తాజా ఇంటర్వ్యూలో షాకిచ్చే విషయం చెప్పారు. ఇంకా చాలా సంగతులు అతడు హిందీ మీడియాతో చాలా కాలం తర్వాత మనసు విప్పి మాట్లాడారు.
నిజానికి హౌస్ ఫుల్ 4 కి పని చేసేప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొన్ననని, రిలీజ్ తేదీ, కాల్షీట్లు మార్చడం నాకు ఇష్టం లేనందున హౌస్‌ఫుల్ 4 నుండి నిష్క్రమించానని తెలిపాడు సాజిద్. నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా 10-15 మంది బిజీ నటులతో భారీ సెట్‌ను వేశారు. డేట్‌లు మార్చడం వల్ల కొన్నాళ్ల పాటు సినిమాకు అంతరాయం ఏర్పడుతుంది. నాపై మీడియా ఏకపక్షంగా రాసింది. నా ఆత్మగౌరవం సందేహానికి గురైంది. నేను ఇతరులతో మాట్లాడేప్పుడు అభ్యంతరకరమైన హాస్యం కారణంగాను పాపులరయ్యాను. నా మాట తీరు మార్చుకోవాలని ఆ తర్వాత తెలుసుకున్నాను. నేనెప్పుడూ స్త్రీలను అగౌరవపరచలేదు.. ఎప్పటికీ అలా చేయను. లింగ సమానత్వంపై నమ్మకం ఉండేలా ప్రవర్తించేలా మా అమ్మ నన్ను పెంచింది. నా మాట తీరు నన్ను ఇంత భారీ మూల్యం చెల్లించేలా చేస్తాయని నేను గ్రహించలేదు.. అని సాజిద్ ఖాన్ వివరణ ఇచ్చారు.
మీటూ ఆరోపణల సమయంలో మీ కుటుంబం ఎలా స్పందించింది? అని హిందీ మీడియా ప్రశ్నించగా, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొనే సమయంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో షూటింగ్ చేస్తున్నానని సాజిద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. నేను సినిమా నుండి నిష్క్రమించవలసి వచ్చినప్పుడు ఆమెకు తెలిస్తే గుండెపోటు వస్తుందని భయపడిపోయాను. వార్తాపత్రికలను ఆమె నుండి దాచమని నేను ఫరా (సోదరి ఫరాఖాన్-దర్శకురాలు)కి చెప్పాను. 10 రోజుల పాటు, నేను అంతా బాగానే ఉన్నట్లు నటించాను, నేను సెట్‌లో ఉన్నట్లుగా ఇంటిని విడిచిపెట్టి తిరిగి వచ్చాను... నేను ఏ స్త్రీకి వ్యతిరేకంగా ఎప్పుడూ ఎప్పుడూ మాట్లాడను. అయితే గత ఆరేళ్లు స్వీయ అంచనా వేసుకునే కాలం. మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ తిరిగి పనికి వెళ్లారు. కానీ నేను వెళ్లలేదు. అది కఠినంగా అనిపించింది. నేను నా జీవితాన్ని మాత్రమే కాకుండా ప్రజలతో మాట్లాడే విధానాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది. నేను ఇప్పుడు చాలా సంయమనంతో ఉన్నాను.. అని సాజిద్ తెలిపారు.
ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎవరూ నాకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కాలేదు. నాకు ఇప్పుడు ఏడాది మధ్యలో ఒక సినిమా ఉంది.. కానీ విజయంపై గ్యారెంటీ లేదు.. అది ఇండస్ట్రీ స్వభావం... అని కూడా సాజిద్ వ్యాఖ్యానించారు.