Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ షెల్ కంపెనీ ద్వారా నిధులు విదేశాల‌కు పంపాడు?!

జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై డిజాస్ట‌రైన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Sep 2024 11:18 AM GMT
డైరెక్ట‌ర్ షెల్ కంపెనీ ద్వారా నిధులు విదేశాల‌కు పంపాడు?!
X

ద‌ర్శ‌కుడితో నిర్మాత‌ల‌కు స‌రిగా సింక్ కుద‌ర‌క‌పోతే ఆ సినిమా ఏమవుతుందో చాలా ఉదాహ‌ర‌ణ‌లే ఉన్నాయి. అర్థాంత‌రంగా కోట్లాది రూపాయ‌ల‌ డ‌బ్బు గంగ‌లో పోసిన చందం అవుతుంది. అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నం - బ‌డే మియాన్ చోటే మియాన్ (2024). ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడికి, నిర్మాత‌ల‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై డిజాస్ట‌రైన సంగ‌తి తెలిసిందే. పంపిణీదారుల‌కు భారీ ఎత్తున న‌ష్టాల్ని మిగిల్చింది. ఇంత‌లోనే ఇప్పుడు ద‌ర్శ‌కుడితో నిర్మాత‌ల గొడ‌వ‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

ఇంత‌కుముందే త‌న‌కు చెల్లించాల్సిన 7.50 కోట్ల బ‌కాయిని `బ‌డే మియాన్ చోటే మియాన్` నిర్మాత‌లు చెల్లించ‌లేద‌ని ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. కానీ ఇప్పుడు భ‌గ్నానీలు దీనికి ధీటుగా స్పందించారు. తిరిగి ద‌ర్శ‌కుడిపైనా కౌంట‌ర్ ని ఫైల్ చేసారు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన వాషు భగ్నానీ - జాకీ భగ్నానీలు దర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫర్‌పై `బడే మియాన్ చోటే మియాన్` షూటింగ్ సమయంలో అబుదాబి అధికారుల నుండి తీసుకున్న సబ్సిడీ నిధులను స్వాహా చేసినట్లు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 3న వారు ఈ పిర్యాదును దాఖలు చేసార‌ని న్యూస్ 18 త‌న క‌థ‌నంలో పై వివ‌రాల్ని పేర్కొంది. దర్శకుడు జాఫ‌ర్‌ని ముంబైలోని బాంద్రా పోలీసులు త్వరలో పిలిపించి విచారించే అవకాశం ఉందని స‌ద‌రు పోర్ట‌ల్ వెల్ల‌డించింది. అలీ అబ్బాస్ జాఫర్ రూ. 9.50 కోట్ల మోసానికి పాల్పడ్డారని భగ్నానీలు తమ ఫిర్యాదులో ఆరోపించారు. బలవంతం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, దోపిడీ, బ్లాక్‌మెయిలింగ్, క్రిమినల్ బెదిరింపు, వేధింపులు, నేరపూరిత పరువు నష్టం , మనీలాండరింగ్ వంటి ఆరోప‌ణ‌లు వారు చేసారు. అబుదాబిలోని షెల్ కంపెనీ ద్వారా జాఫర్ ఈ నిధులను ఉపయోగించారని భ‌గ్నానీలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇంత‌కుముందే అలీ అబ్బాస్ జాఫర్ కూడా భగ్నానీస్ తనకు రూ. 7.30 కోట్ల పారితోషికానికి సంబంధించిన‌ బ‌కాయిని ఇంకా చెల్లించలేదని ఆరోపించాడు. దైనిక్ భాస్కర్ క‌థ‌నం ప్రకారం.. డైరెక్టర్స్ అసోసియేషన్ త‌న విష‌యంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అధికారిక ఫిర్యాదును దాఖలు చేశారు. ఫిర్యాదు తర్వాత ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (FWICE) కూడా చెల్లించని బకాయిలపై వివరణ కోరుతూ వాషు భగ్నానీకి లేఖ పంపింది. అయితే పూజా ఎంటర్‌టైన్‌మెంట్ జాఫర్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది. క్లెయిమ్ చేసిన బకాయిలు చట్టబద్ధమైన దావాను కలిగి ఉండవు. బిఎంసిఎం ఫిల్మ్స్ లిమిటెడ్ ద్వారా మాకు తెలియజేసిన‌ వివిధ సెట్-ఆఫ్‌లకు బాధ్యత వహిస్తాయి అని ఒక ప్రకటన విడుదల చేసింది. తరువాత సినీ ఉద్యోగుల సంఘం అలీ అబ్బాస్ జాఫర్‌ను నిర్మాత‌లు చెల్లించని బకాయిల దావా రుజువును సమర్పించమని కోరింది.

`బడే మియాన్ చోటే మియాన్` మాతృక 1998లో విడుద‌ల కాగా, దీనికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, గోవింద ప్రధాన పాత్రలలో నటించారు. అది బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించింది. 2024లో విడుద‌లైన `బడే మియాన్ చోటే మియాన్`లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం థియేటర్లలోకి రాగా, ప్రేక్షకులు విమర్శకులు తిరస్కరించారు. YRF నుండి బ‌య‌ట‌కు వెళ్లాక‌ స్వతంత్ర దర్శ‌కుడిగా అలీ అబ్బాస్ జాఫర్ ఇంకా విజయవంతమైన చిత్రాన్ని ఇవ్వలేదు.