మెహర్‌లో కొత్త కోణాల్ని బయటికి తీసిన కొలీగ్స్
దర్శకుడు మెహర్ రమేష్ కొన్ని వరుస ఫ్లాపులు తీసి టాలీవుడ్ రేసులో వెనకబడిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Aug 2023 4:00 AM GMTదర్శకుడు మెహర్ రమేష్ కొన్ని వరుస ఫ్లాపులు తీసి టాలీవుడ్ రేసులో వెనకబడిన సంగతి తెలిసిందే. అయితే అతడి సహనం ఫలించి ఇప్పుడు మెగస్టార్ చిరంజీవి తో భోళాశంకర్ లాంటి అవకాశం దక్కిందని చెప్పాలి. ఈ సినిమా త్వరలో విడుదల కానుండగా ప్రీరిలీజ్ వేదికపై మెహర్ పై ఇండస్ట్రీ కొలీగ్స్ ప్రశంసల వర్షం కురిపించారు. అతడి హెల్పింగ్ నేచుర్ ని ముఖ్యంగా ప్రశంసించారు. ఇందులో గోపిచంద్ మలినేని- వంశీ పైడిపల్లి- బాబి వంటి దర్శకులు ఉన్నారు.
నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు మెహర్ ఇచ్చిన సహకారం అతడు చూపించిన మంచితనం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని గోపిచంద్ మలినేని అన్నారు. ఒకరికి మాటిస్తే అతడికి సహకరించేందుకు ఎంత దూరం అయినా వెళ్లే వ్యక్తి మెహర్ రమేష్ అని గోపిచంద్ మలినేని ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అన్నయ్య ప్రారంభించిన నిత్యావసరాల సాయం సహా ఎన్నో సేవా కార్యక్రమాలకు మెహర్ బ్యాక్ బోన్ గా నిలిచారని అన్నారు. కోవిడ్ ముప్పుకు భయపడిన ప్రజలు ఎవరూ బయటకు రావడానికే ఒణుకుతుంటే చిరంజీవి గారి కార్యక్రమాలకు అన్నీ తానే అయి ముందుకు వచ్చి మెహర్ ఇప్పుడు ఈ అవకాశం అందుకోవడం సముచితమని అన్నారు. అంతేకాదు.. కోవిడ్ సమయంలో కొందరికి ఇంజెక్షన్లు కావాలని ఫోన్ చేసి నన్ను అడిగాడు. రాత్రి 2 గం.లకు ఫోన్ చేసి స్నేహితులు విద్యార్థులు బస్సుల్లో చిక్కుకున్నారు వారిని బయటకు తేవాలి ఎలా? అని అడిగాడు. అతడు చేసిన మంచి పనులు ఈ రోజు ఈ అవకాశం కల్పించాయని భావిస్తున్నాను.. అని అన్నారు.
బాబి మాట్లాడుతూ.. ఆచార్య తర్వాత 'గాడ్ పాదర్' రిలీజైంది. వరుసగా రీమేక్ లు వద్దు అనుకోవడంతో భోళాశంకర్ ని వెనక్కి నెట్టారు. అలా నేను తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య ముందుకు వచ్చిందని ఆ సమయంలో మెహర్ ఎంతో ఓపిగ్గా వేచి చూశారని అంతేకాకుండా 'వాల్తేరు వీరయ్య' తర్వాత భోళాశంకర్ ని తెరకెక్కిస్తున్న అతడి ఓపికకు ధన్యవాదాలు అని కూడా అన్నారు. మెహర్ రమేష్ అవకాశం కల్పించిన ఆర్టిస్టులంతా ఆయనకు వేదికపై ధన్యవాదాలు తెలియజేసారు.