ఆ రోజు కోసం దర్శకసంఘం ప్లాన్స్
దశాబ్ధాల పాటు సినీపరిశ్రమకు పెద్ద దిక్కుగా కొనసాగిన దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానంతర పరిణామాల గురించి తెలిసిందే
By: Tupaki Desk | 9 April 2024 8:19 AM GMTదశాబ్ధాల పాటు సినీపరిశ్రమకు పెద్ద దిక్కుగా కొనసాగిన దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానంతర పరిణామాల గురించి తెలిసిందే. ఆయన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. సినీపరిశ్రమలో ఏ సమస్య ఉన్నా తానున్నానని ఆదుకునేవారు దాసరి. సమస్యల్ని సామరస్యంగా పెద్దరికంగా పరిష్కరించేవారు. కార్మికకర్షకుల నుంచి ప్రతి ఒక్కరూ ఆయనను సంప్రదించేవారు. అదుపు తప్పిన బడ్జెట్ల గురించి, పెచ్చు మీరిన స్టార్ల పారితోషికాల గురించి ఆయన ఒక్కరే నిలదీయగలిగారు. ఆ తర్వాత ఆ పరిస్థితి లేదు.
అందుకే దర్శకదిగ్గజం దాసరి లేకపోయినా ఇప్పటికీ ఆయనను తలవని వారు లేరు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4న తెలుగు చిత్ర పరిశ్రమ దర్శకుల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. చాలా కాలంగా ఈ ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సంవత్సరం వేడుకలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు దర్శకుల సంఘం నిర్ణయం తీసుకుందని తెలిసింది.
ఇప్పటికే వెన్యూని కూడా ఫిక్స్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బహుశా గచ్చిబౌలి స్టేడియంలో దర్శకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్లాన్ చేస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై అసోసియేషన్ లో చర్చ జరుగుతోంది. దక్షిణాది చిత్రసీమలో ప్రముఖ దర్శకులంతా ఈ వేడుకకు విచ్చేసేందుకు ఆస్కారం ఉంది. అలాగే ప్రముఖ స్టార్లు అంతా ఈ వేడుకలో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది.