కెప్టెన్ ఆఫ్ ది షిప్ భరోసా ఇక రిలాక్స్ అవ్వొచ్చు!
స్టార్ డైరెక్టర్ శంకర్ కెరీర్ లో తొలిసారి రెండు సినిమాల్నిఒకేసారి తెరెక్కించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 9 July 2024 7:00 AM GMTస్టార్ డైరెక్టర్ శంకర్ కెరీర్ లో తొలిసారి రెండు సినిమాల్నిఒకేసారి తెరెక్కించిన సంగతి తెలిసిందే. 'భారతీయుడు-2 'తో పాటు రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్' చిత్రం షూటింగ్ చేసారు. ఇలా పనిచేయాల్సి వస్తుందని శంకర్ కూడా అనుకోలేదు. ఆరకంగా శంకర్ కిది కొత్త రకమైన ఎక్స్ పీరియన్స్. ఇదంతా అతడు అనుకోకుండా జరిగింది. భారతీయుడు మొదలు పెట్టినా అనివార్య కారణాలతో ఆగిపోవడంతో చరణ్ తో గేమ్ ఛేంజర్ మొదలు పెట్టడం.. ఆ తర్వాత కొన్ని నెలలకి భారతీయుడ-2ని రీస్టార్ట్ చేయడం జరిగింది.
ఈ క్రమంలో తెలుగు, తమిళ ఆడియన్స్ లో ఎన్నో రకాల సందేహాలు బుర్రల్ని తొలచడం ప్రారంభమైంది. శంకర్ ఏ సినిమా చేసినా అది పూర్తయ్యేవరకూ మరో సినిమా జోలికి వెళ్లరు. పర్పెక్షన్ కోసం ఎంత కాలమైనా వెయిట్ చేసే దర్శకుడు. అలాంటి మేకర్ ఒకేసారి రెండు సినిమాలు చేయడంతో 'ఏ సినిమా ఎలా వస్తుంది? క్వాలిటి ఎలా ఉంటుంది? అభిమానులు అనుకున్న రేంజ్ లో చూపిస్తారా? లేదా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి.
అయితే తాజాగా వాటన్నింటిని శంకర్ భారతీయుడు ప్రెస్ మీట్ లో నివృతి చేసారు. దీనికి శంకర్ బదులిస్తూ..'క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. నాకు కొవిడ్ టైంలో దొరికిన ఖాళీలో 'భారతీయుడు-2'లో మిగిలిన పార్ట్ మొత్తానికి క్రియేటివ్ వర్క్‌తో పాటు అన్నీ పూర్తి చేశాను. ఎప్పుడు ఆ సినిమా పున:ప్రారంభమైనా మళ్లీ కొత్తగా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా అన్నీ పూర్తయ్యాయి. దీంతో రెండు సినిమాలు తీయడంలో నాకు ఎలాంటి అసౌకర్యం కనిపించలేదు.
ఒకవేళ దీని వల్ల క్వాలిటీ మీద ఏమైనా ప్రభావం పడుతుందేమో అని నాతో సహా అందరూ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టారు. అందు వల్ల క్వాలిటీ పెరిగిందే తప్ప తగ్గలేదు. నేను ఒక టైంలో ఒక సినిమా చేస్తున్నపుడు ఎలాంటి క్వాలిటీ చూపిస్తానో, అదే క్వాలిటీ రెండు సినిమాల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది తప్ప తగ్గదు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు' అని అభిమానులకు భరోసా కల్పించారు. ఇదే సమయంలో కమల్ హాసన్ కల్పించుకుని శంకర్ ప్రతిభని చెప్పే ప్రయత్నం చేసారు. ఒకప్పుడు బాలచందర్ ఒకే ఏడాది నాలుగు సినిమాలు తీసిన విషయం.. దాసరి ఒకేసారి పలు చిత్రాల రైటింగ్‌లో పాలు పంచుకుని వరుసగా హిట్లు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.