'సినిమా చెట్టు'ను బ్రతికించుకుందాం!
తాజాగా ఈ చెట్టు కూలిపోవ డంపై దర్శకుడు వంశీ భావోద్వేగానికి గురయ్యారు. చెట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
By: Tupaki Desk | 8 Aug 2024 12:02 PM GMTతూర్పుగోదావరి జిల్లా కొవ్వురూ మండలం కుమారదేవంలోని 150 ఏళ్ల వయసు గల 'సినిమా చెట్టు'( నిద్దగన్నేరు) ఇటీవల వర్షాల కారణంగా కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చెట్టు కూలిపోవ డంపై దర్శకుడు వంశీ భావోద్వేగానికి గురయ్యారు. చెట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చెట్టును బ్రతికించాలంటూ తన భావన బయట పెట్టారు. వంశీ 22 సినిమాల్లో సుమారు 18 సినిమాల్లో చెట్టు సీన్ ఉంటుంది.
'మంచుపల్లకి, సితార, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి గోపిక గోదావరి ఇలా కొన్ని సినిమాల షూటింగ్ ఆచెట్టు దగ్గర నిర్వహించారు. దీంతో ఆ చెట్టుతో ఆయన అనుబంధాన్ని స్థానికులతో గుర్తు చేసుకున్నారు. ఈ చెట్టు కుమారదేవం గ్రామానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందన్నారు. గోదావరి ఒడ్డున షూటింగ్ చేస్తే కచ్చితంగా ఈ చెట్టు కింద ఏదో ఒక సీన్ తీసేవాడినన్నారు. ఈ చెట్టు వయసు 150 ఏళ్లు ఉంటుదన్నారు.
వంశీ కంటే ముందు మరెంతో మంది సీనియర్ దర్శకులకు ఆ చెట్టుతో గొప్ప అనుబంధం ఉంది. సుప్రసిద్ద దర్శకులు జంధ్యాల, బాపు-రమణ, కె. విశ్వనాధ్, రాఘవేందర్రావు, వంశీ ఇలా అప్పటి సూపర్ హిట్ సినిమాల దర్శకులంతా ఆ చెట్టును షూటింగ్ కోసం వినియోగించుకున్నారు. దీంతో చెట్టు ఆ దర్శకులు ఫేవరెట్ గా మారింది.
పాడి పంటలను'(1975) నుంచి మొన్నటి 'రంగస్థలం' (2018) వరకూ ఆ చెట్టు సినిమా షూటింగ్ లకు ఎంతో అనువైన చెట్టుగా చరిత్ర సృష్టించింది. ఆ చెట్టు చుట్టూ 100..200 కాదు ఏకంగా 300 సినిమాలు షూటింగ్లు జరిగాయి. సినిమాల పరంగా చూసుకుంటే ఆ చెట్టు ఐదు దశాబ్దాల పాటు తన సేవల్ని సినీ పరిశ్రమకి అందించింగా చెప్పొచ్చు. అయితే ఆ చెట్టు కూలిపోయినా ఇంకా భూమిలో వేళ్లు బ్రతికే ఉన్నాయి. మళ్లీ చిగురించడానికి అవకాశం ఉంది. ఆ ఛాన్స్ తీసుకుందామని వంశీ తన మాటల్లో బయట పెట్టారు.