గంటకు 5లక్షలు చెల్లిస్తేనే టైమిస్తానన్న డైరెక్టర్
తన నుంచి సలహా కోరిన కొత్త వారి నుండి డబ్బు వసూలు చేస్తానని కరాఖండిగా చెప్పాడు.
By: Tupaki Desk | 23 March 2024 12:08 PM GMTప్రఖ్యాత దర్శకనిర్మాత, గురువు అనురాగ్ కశ్యప్ పరిశ్రమలో కొత్తవారికి సహాయం చేయడంలో విసుగెత్తానని తన నిరాశను వ్యక్తం చేశారు. తాజాగా ఒక ఊహించని ప్రకటనతో అందరికీ షాకిచ్చాడు. అతడి నిర్ణయం కలకలం రేపింది. అనురాగ్ తన విలువైన సమయానికి రేట్ కార్డ్‌ను డిజైన్ చేసాడు. ఎవరైనా కొత్త వారు తన సలహాలు సూచనలు కావాలనుకుంటే, సేవలను కొనుగోలు చేయగలిగితే మాత్రమే అలాంటి వారు తనను సంప్రదించాలని సూచించాడు. డబ్బు పెట్టి కొనలేని వాళ్లు తనను సహాయం కోరడం మానుకోవాలని, తన విలువైన సమయాన్ని వృధా చేయొద్దని సూచించాడు. కోపంతో ఉన్న అనురాగ్ కశ్యప్ ఈ దిగ్భ్రాంతికరమైన పోస్ట్‌ను షేర్ చేసాడు. తన నుంచి సలహా కోరిన కొత్త వారి నుండి డబ్బు వసూలు చేస్తానని కరాఖండిగా చెప్పాడు. తన రేట్లు ఎలా ఉంటాయో కూడా వెల్లడించాడు. వివరాల్లోకి వెళితే..
అనురాగ్ కశ్యప్ ఆధునిక భారతీయ సినిమా పరిశోధకుడు.. తన ప్రత్యేకమైన దర్శకత్వ దృష్టి- రచనతో అసాధారణమైన అన్వేషణతో కథల సరిహద్దులను పునర్నిర్వచించిన మేటి దర్శకుడు. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ నుండి సేక్రేడ్ గేమ్స్ వరకు అనురాగ్ నిరంతరం చర్చల్లో వ్యక్తి అయ్యాడు. ముఖ్యంగా అతడి వివాదాస్పద అభిప్రాయాలు, ఆలోచనలు నిరంతరం హెడ్ లైన్స్ లోకొస్తున్నాయి. ఇప్పుడు ఇదే పంథాను అనుసరిస్తూ.. ఇక నుండి తనను సలహా కోసం కలవడానికి వచ్చే వ్యక్తులు, తనతో ఆలోచనలను చర్చించాలనుకునే వారి నుండి డబ్బు వసూలు చేస్తానని వెల్లడించాడు.
శనివారం నాడు.. అనురాగ్ కశ్యప్ తన ఇన్‌స్టాగ్రామ్ లో అందరికీ హెచ్చరిక సందేశాన్ని షేర్ చేసాడు. దాని సారాంశం ఇలా ఉంది. ``కొత్తవారికి సహాయం చేయడానికి నేను చాలా సమయాన్ని వృధా చేసాను. చాలావరకు సాధారణమైన s**tతో ముగించాను. కాబట్టి ఇప్పుడు నేను సృజనాత్మక మేధావులని భావించే యాధృచ్ఛిక వ్యక్తులను కలవడం ద్వారా నా సమయాన్ని వృథా చేయకూడదనుకుంటున్నాను. కాబట్టి నేను ఇప్పుడు రేట్లు ఫిక్స్ చేసాను. ఎవరైనా నన్ను కలవాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందే. 10-15 నిమిషాలకు నేను 1 లక్ష, అరగంటకు 2 లక్షలు.. 1 గంటకు 5 లక్షలు వసూలు చేస్తాను. నేను ప్రజలను కలవడం కోసం సమయం వృధా చేయడంలో విసిగిపోయాను. మీరు నిజంగా నా టైమ్‌ని కొనుగోలు చేయగలరని భావిస్తే నాకు కాల్ చేయండి.. లేదా f**k దూరంగా ఉండండి. అందరూ ముందుగానే చెల్లించాల్సిందే!! అని అనురాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. నా ఉద్దేశ్యం ఏమంటే.. నాకు ఎవరూ టెక్స్ట్ లేదా డిఎమ్ చేయవద్దు. మీకు టైమ్ ఉంటుంది. కానీ నేను స్వచ్ఛంద సంస్థను కాదు.. సత్వరమార్గాల కోసం వెతుకుతున్న వ్యక్తులతో నేను విసిగిపోయాను. నన్ను కలవడానికి దగ్గర దారులు ఉండవు.. అని తెలిపాడు.
అనురాగ్ ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఇమైక్కల్ నోడిగల్ అనే తమిళ చిత్రంలో నటించాడు. ఇటీవల విజయ్ `లియో`లోను నటించాడు. కానీ ఇప్పుడు దర్శకుడిగా కోలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. తాజాగా జీవీ ప్రకాష్ కథానాయకుడిగా హిందీ, తెలుగు, తమిళం త్రిభాషా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రేక్షకులను స్క్రీన్‌పై అతుక్కుపోయేలా ఉండే హైబడ్జెట్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంతో GV ప్రకాష్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు.
దర్శకరచయిత, నటుడు అనురాగ్ కశ్యప్ తమిళ సినిమాలకు విపరీతమైన అభిమాని. ఇటీవల విడుదలైన సౌత్ సినిమాల గురించి తన సమీక్షలను తరచుగా షేర్ చేస్తున్నాడు. ఇటీవలే సందీప్ వంగా యానిమల్ చిత్రాన్ని ప్రశంసించాడు. గత కొంతకాలంగా దర్శకుడిగా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇటీవలి సినిమాలు తాప్సీ పన్నుతో దోబారా, DJ మొహబ్బత్‌తో ప్యార్ , కెన్నెడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులయ్యాయి.