ఆస్పత్రిలో స్టార్ హీరో... ఆందోళనలో అభిమానులు!
తమిళ సినీ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం (డీఎండీకే) పార్టీ అధినేత విజయకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు
By: Tupaki Desk | 20 Nov 2023 7:22 AM GMTతమిళ సినీ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం (డీఎండీకే) పార్టీ అధినేత విజయకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. "రివల్యూషనరీ స్టార్" గా తన సినిమాలతో అలరించిన ఆయన.. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. అత్యంత బలమైన మాస్ ఫ్యాన్ బెల్ట్ ఉన్న హీరోల్లో ఒకరిగా ఉన్న విజయ కాంత్ తాజాగా అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవును... విజయకాంత్ తీవ్ర అనారోగ్యం కారణంగా అస్పత్రిలో చేరారని అంటున్నారు. ఇందులో భాగంగా... చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు! అయితే... "విజయకాంత్ ఇన్ హాస్పటల్" అనే విషయం బయటకు పొక్కడంతో ఆయన అభిమానుల్లోనూ, మరిముఖ్యంగా డీఎండీకే కీలక నేతల్లోనూ ఆందోళన నెలకొందని తెలుస్తుంది. వారంతా ఆస్పత్రి వైపు ప్రయాణమయ్యారని అంటున్నారు.
ఇటీవల... పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తమ అభిమాన నాయకుడు, అభిమాన నటుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన అభిమానులు, కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటినుంచీ విజయకాంత్ ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవిలో ఉన్న సతీమణి ప్రేమలత చూసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనకు సడన్ గా మరోసారి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుందని తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండన్న చందంగా... మరోపక్క సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్య సమస్యలు, ప్రస్తుత పరిస్థితి గురించి తప్పుడు ప్రచారాలు మొదలైపోయాయి!
దీంతో... ఈ సోషల్ మీడియా ప్రచారాలకు ముగింపు పలికే విధంగా డీఎండీకే కార్యాలయం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఆయన ఆరోగ్యం గురించి ఒక ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్ కు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించారని.. రెండు రోజులలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని.. అభిమానులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది!
కాగా తమిళ చిత్రసీమలో స్టార్ నటుడు, నటీనటుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అనంతరం పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిన విజయకాంత్ ఆ తర్వాత డీఎండీకే అనే పార్టీని ప్రారంభించారు. ఆ టైం లో కరుణానిధి, జయలలిత ఉన్నప్పుడే వారికి పోటీగా పార్టీని బలోపేతం చేసి 10 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 40 నియోజకవర్గాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష నేతగా ఎదిగారు.