బెడ్ రెస్ట్ లో సాయి పల్లవి..
సాయి పల్లవి ఏదైనా సినిమాలో పని చేస్తుందంటే దర్శక నిర్మాతలు హ్యాపీగా గుండెల మీద చేతులేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు.
By: Tupaki Desk | 1 Feb 2025 8:07 AMసాయి పల్లవి ఏదైనా సినిమాలో పని చేస్తుందంటే దర్శక నిర్మాతలు హ్యాపీగా గుండెల మీద చేతులేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. సినిమాలో నటించడం దగ్గర నుంచి, సినిమా అయిపోయాక ప్రమోషన్స్ వరకూ ప్రతీ దాంట్లో పాల్గొని తన నుంచి 100% ఇస్తుంది. సినిమా కోసం ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటుంది సాయి పల్లవి.
అందుకే ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలంతా ఆసక్తి చూపిస్తారు. సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ప్రస్తుతానికి రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా పలు ప్రధాన నగరాలన్నీ తిరిగి సినిమాను ప్రమోట్ చేస్తోంది. తండేల్ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే వైజాగ్, చెన్నై, ముంబైలో పలు ఈవెంట్లు నిర్వహించి రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ఈవెంట్లలో దర్శక నిర్మాతలతో పాటూ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి కూడా పాల్గొంటున్నారు. అయితే రీసెంట్ గా ముంబైలో జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ కు సాయి పల్లవి హాజరు కాలేదు. సాయి పల్లవి అనారోగ్యం కారణంగానే ముంబైలో జరిగిన ఈవెంట్ కు హాజరు కాలేకపోయిందని డైరెక్టర్ చందూ మొండేటి తెలిపాడు.
గత కొన్ని రోజులుగా సాయి పల్లవి జలుబు, జ్వరంతో ఇబ్బంది పడుతుందనీ, అయినప్పటికీ ఆమె సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనడంతో సాయి పల్లవి మరింత నీరసించిందని, డాక్టర్లు ఆమెకు కనీసం రెండ్రోజుల పాటూ బెడ్ రెస్ట్ అవసరమని చెప్పినట్టు డైరెక్టర్ చందూ మొండేటి తెలిపాడు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన తండేల్ సినిమాలో చైతన్య రాజు పాత్రలో నటించగా, సాయి పల్లవి బుజ్జితల్లి పాత్రలో కనిపించనుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన మూడు పాటలు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఫిబ్రవరి 7న తండేల్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.