తెరపైకి డొక్కా సీతమ్మ లైఫ్ స్టోరీ.. ఆమె కథ తెలిస్తే షాకవ్వక మానరు
ఆకలితో ఉన్న ఎంతోమందికి ఆకలిని తీర్చి ఉభయగోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగా పేరు తెచ్చుకుని ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ గురించి అందరికీ తెలుసు.
By: Tupaki Desk | 4 April 2025 10:30 AMమనకు ఉన్నది ఏదైనా సరే దానం చేస్తే దానికి రెట్టింపు మనకు తిరిగొస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. అయితే అన్ని దానాల్లోకంటే అన్నదానం గొప్పదని, ఆకలి బాధ అందరికీ సమానమేనని అందుకే కుదిరితే తప్పకుండా అన్నదానం చేయమని చెప్తూ ఉంటారు. ఆకలితో ఉన్న ఎంతోమందికి ఆకలిని తీర్చి ఉభయగోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగా పేరు తెచ్చుకుని ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ గురించి అందరికీ తెలుసు.
ఆవిడ ఎంతో మంది ఆకలిని తీర్చి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. అందుకే ఆమె కథను అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ జీవిత కథను సినిమాగా తీస్తున్నారు. డొక్కా సీతమ్మ పాత్రలో సీనియర్ నటి ఆమని నటించడనుండగా, రవి నారాయణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వచ్చిన ప్రతీ రూపాయి డొక్కా సీతమ్మ పేరుపై ఉన్న స్కీమ్ కోసం ప్రభుత్వానికి విరాళంగా ఇస్తామని కూడా తెలిపారు.
ఈ సినిమాలో అసలు డొక్కా సీతమ్మ ఎవరు? ఆమె ఆంధ్ర అన్నపూర్ణగా ఎలా ఫేమస్ అయారు? బ్రిటీష్ దొరే ఆమెకు చేతులెత్తి నమస్కరించేంత గొప్పగా సీతమ్మ ఎలా ప్రసిద్ధి చెందారనే విషయాలను చూపించనున్నారు. సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి భవానీ శంకరంను ఊర్లో అందరూ బువ్వన్న అని పిలిచేవారు. అడిగిన అందరికీ ఆయన అన్నం పెట్టడంతో అతన్ని అలా పిలిచేవారు. ఆమె చిన్నప్పుడే సీతమ్మ తల్లి చనిపోవడంతో ఇంటిని నడిపే బాధ్యత సీతమ్మపై పడింది.
ఆ బాధ్యతను ఎంతో పవిత్రంగా భావించిన సీతమ్మ తన తండ్రి బాటలోనే నడిచి ఆకలితో ఉన్న ప్రతీ ఒక్కరికీ అన్నం పెట్టడం అలవాటు చేసుకున్నారు. తర్వాత డొక్కా జోగన్న పంతులు అనే పెద్ద ధనవంతుడిని పెళ్లి చేసుకుని, పెళ్లి తర్వాత కూడా ఆకలితో ఉన్న వారికి కాదు, లేదు అనకుండా ఆకలిని తీరుస్తూనే ఉన్నారామె. సొంత డబ్బుతోనే సీతమ్మ ఇదంతా చేసేవారు.
సీతమ్మ గొప్పతనం తెలుసుకున్న బ్రిటీష్ 7వ ఎడ్వర్డ్ చక్రవర్తి పట్టాభిషేకం వార్షికోత్సవంకు రావాలని ఆమెకు ఆహ్వానం పంపగా ఆమె తాను రాలేనని చెప్పిందట. కనీసం ఆమె ఫోటోను పక్కన పెట్టుకుని అయినా పట్టాభిషేకం చేయించుకుందామనుకున్న చక్రవర్తి అప్పట్లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు లెటర్ రాయగా, ఆమె ఫోటో కోసం కలెక్టర్ వెళ్లగా ఆమె తిరస్కరించారని, ఇది బ్రిటీష్ రాజు ఆర్డర్ అని, ఫోటో తీయించుకోకపోతే తన ఉద్యోగం పోతుందని చెప్పడంతో అప్పుడు సీతమ్మ ఒప్పుకున్నారని చెప్తుంటారు. ఆమె ఫోటోను బ్రిటీష్ చక్రవర్తి పక్కన ఓ సోఫాలో పెట్టుకుని ఆమెకు నమస్కరించి ఆ తర్వాతే పట్టాభిషేకం చేసుకున్నారట. అందుకే ఆమె పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఆహార శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. వినడానికే ఈ కథ ఇంత గొప్పగా ఉంటే సరిగ్గా తీయగలిగితే సినిమాలో గూస్‌బంప్స్ ఎలిమెంట్స్ ఎన్నో ఉంటాయి. ఎంతోమందికి తెలియని ఇలాంటి కథలు సినిమాల్లాగా వస్తే భవిష్యత్తు తరాలకు కూడా ఇవన్నీ తెలిసే అవకాశముంటుంది.