Begin typing your search above and press return to search.

మా దగ్గరే కొనాలి లేకుంటేనా? ట్రంప్ ‘గ్యాస్’ వార్నింగ్

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజునే 50 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   21 Dec 2024 4:36 AM GMT
మా దగ్గరే కొనాలి లేకుంటేనా? ట్రంప్ ‘గ్యాస్’ వార్నింగ్
X

అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని కలలు కన్న డొనాల్డ్ ట్రంప్.. తాను అనుకున్నట్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించటం తెలిసిందే. కొత్త ఏడాదిలో బాధ్యతలు చేపట్టనున్న ఆయన.. దానికి ముందు నుంచే తన పాలన ఏ రీతిలో ఉంటుందన్న విషయాన్ని మాటలతో చెప్పేస్తున్నారు. అధికారబదిలీ మాత్రమే మిగిలిన నేపథ్యంలో.. తాను పాలనా పగ్గాలు చేపట్టేందుకు ముందుగానే.. తన పాలనా తీరు ఏ రీతిలో ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కెనడా.. మెక్సికోలకు ఆర్థిక హెచ్చరికలు చేసిన ఆయన.. ఈ మధ్యన భారత్ కు తనదైన శైలిలో వార్నింగ్ లు ఇచ్చారు.

తాజాగా ఆ జాబితాలో ఐరోపా సమాఖ్య దేశాలు చేరాయి. అమెరికా - ఐరోపా సమాఖ్య మధ్య వాణిజ్య అంతరం భారీగా ఉన్నట్లుగా చెబుతున్న వైట్ హౌస్ నివేదికల్ని ప్రస్తావిస్తూ.. గ్యాస్.. ఇంధనాన్ని అమెరికా నుంచే ఆ దేశాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయని పక్షంలో అన్ని టారిఫ్ లను పెంచేస్తామనన ఆయన.. 2022 గణాంకాల ప్రకారం ఈయూ - అమెరికా మధ్య 202.5 బిలియన్ డాలర్ల వాణిజ్య అంతరం ఉన్నట్లుగా పేర్కొన్నారు.

అది కాస్తా ఈ ఏడాది మరింత పెరిగినట్లుగా చెబుతున్నారు. ఈయూ దేశాల సమాఖ్య నుంచి అమెరికా 553 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే.. తాము 350.8 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఈయూకు ఎగుమతి చేసినట్లుగాచెబుతూ.. ఈ అంతరాన్ని వీలైనంత త్వరగా తగ్గించాలన్నారు. ఒకవేళ ఈ అంతరాన్ని తగ్గించుకోకుంటే నాటోకు అదనంగా ఇస్తున్న నిధులను నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజునే 50 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తొలి రోజు నుంచే తన మార్క్ చూపేలా ఆయన ఇప్పటికే ప్రయత్నాలు షురూ చేశారు. గతంలోనూ అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలోనూ ఈయూతో వాణిజ్య అంతరాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన. ఇప్పుడు పదవిని చేపట్టక ముందు నుంచే ఆ అంశాన్ని తెర మీదకు తీసుకురావటం గమనార్హం.

అమెరికా తీరుతో గుర్రుగా ఉన్న ఐరోపా సమాఖ్య ప్రత్యామ్నాయ ప్రయత్నాల్ని చేపట్టింది. దక్షిణ అమెరికా దేశాలపై బ్రెజిల్.. అర్జెంటీనా.. ఉరుగ్వే.. పరాగ్వేలతో భారీ వాణిజ్య ఒప్పందాల్ని చేసుకుంటోంది. దీంతో ఈయూ.. దక్షిణ అమెరికా దేశాల్లోని 700 మిలియన్ల మంది ప్రజలకు చేకూరనుందని చెబుతున్నారు. స్వేచ్ఛా వాణిజ్యంతో పోల్చితే బలమైన గాలులు వ్యతిరేక దిశలో వీస్తున్నట్లుగా ఈయూ చీఫ్ ఉర్సులా వోన్ డేర్ లేయెన్ వ్యాఖ్యానిస్తున్నారు. తన వ్యాఖ్యలతో ట్రంప్ తీరును తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ వాదన మరోలా ఉంది. అమెరికా తిరిగి సుసంపన్నం కావాలంటే టారిఫ్ లను పెంచటమే తగిన నిర్ణయంగా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.